Donald Trump :అమెరికాతో బహుముఖ భాగస్వామ్యం

by Mahesh Kanagandla |
Donald Trump :అమెరికాతో బహుముఖ భాగస్వామ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాతో బహుముఖ భాగస్వామ్యం నెరపాలని, గతంలో కంటే సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని భారత్ తెలిపింది. ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత, మేధో వలసలు, ప్రపంచ శాంతి, సుస్థిరత వంటి అంశాల్లో అమెరికాతో సత్సంబంధాలు ఉంటాయని వివరించింది. డొనాల్డ్ ట్రంప్ తొలి హయాంలో అమెరికాతో భారత్‌కు సత్సంబంధాలే ఉన్నాయని, రెండో హయాంలోనూ ఆ బంధాలు మరింత బలోపేతమవుతాయని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది. అమెరికాతో మరింత సన్నిహితంగా మెలుగుతామని ప్రధాని మోడీ స్పష్టం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వా్ల్ చెప్పారు.

రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, పెట్టబడులు, ఇన్నోవేషన్ వంటి విషయాల్లో అమెరికాతో అన్ని విధాల సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుందని జైస్వాల్ వివరించారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2023లో 190 బిలియన్ డాలర్లకు చేరింది. ఇండియాకు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రతికూల నిర్ణయాలు ఉంటాయనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అందరికీ ఆందోళనకర విషయమేనని, కానీ, అందులోనూ అవకాశాన్ని చూడొచ్చని వివరించారు. ఏ దేశానికైనా అత్యధిక ఆర్థిక వనరులు ఉండొచ్చని, అదే స్థాయిలో నైపుణ్యం, నిపుణులు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొ్న్నారు. ఇక పై అమెరికా సహా చాలా దేశాలు వారి ఆర్థిక స్థితి ఆధారంగా వలసలపై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.

Advertisement

Next Story