యాదాద్రి దర్శనంతో అమితానందం

by Sridhar Babu |
యాదాద్రి దర్శనంతో అమితానందం
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంగళవారం ఉదయం గవర్నర్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం.హనుమంతరావు, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె.జెండగే, డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్ గవర్నర్ కు పూల మొక్కలు బహూకరించి స్వాగతం పలికారు.

రాష్ట్ర గవర్నర్ వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్, ఉన్నతాధికారులు ఉన్నారు. తొలుత రాష్ట్ర గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా దేవస్థాన పుష్కరిణి వద్ద స్నానం ఆచరించారు. తూర్పు రాజగోపురం ద్వారా గవర్నర్ ఆలయంలోనికి ప్రవేశించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏ.భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజ స్తంభం వద్ద మొక్కి తదుపరి స్వామి అంతరాలయంలో అర్చన పూజలు నిర్వహించారు. దర్శనానంతరం గవర్నర్ కు మహా మండపంలో వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

రాష్ట్ర దేవాయదాయ శాఖ కమిషనర్ గవర్నర్ ను శాలువాతో సత్కరించారు. కార్యనిర్వహణ అధికారి స్వామి వారి మెమొంటోను అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి స్వామి ప్రసాదాన్ని గవర్నర్ కు అందచేశారు. అనంతరం దేవాలయం బయట ఉన్న మీడియాతో రాష్ట్ర గవర్నర్ మాట్లాడారు. తాను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మర్చిపోలేని అనుభూతి పొందానన్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఒకసారి స్వామి వారి దర్శనానికి వస్తానని అన్నారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్, ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed