తన భూమిని శ్మశాన వాటిక చేశారంటూ రైతు ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
తన భూమిని శ్మశాన వాటిక చేశారంటూ  రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, రాజాపేట : రాజాపేట మండల కేంద్రానికి చెందిన రైతు కారే నవీన్ శనివారం నడిరోడ్డుపై నిలబడి పెట్రోల్ పోసుకొని, బస్సు ముందుకెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి హల్ చల్ చేశాడు. మండల కేంద్రమైన రాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా రోడ్డుపైన బైఠాయించిన కారె నవీన్ ఒంటిపై అకస్మాత్తుగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టతో నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న బిర్రు శ్యామ్ తో పాటు మరికొందరు అగ్గిపెట్టెను లాక్కొని కారే నవీన్ ఒంటిపై నీటిని గుమ్మడించారు. తన పట్టా భూమిలో కొంత భాగం శ్మశాన వాటికగా మార్చారని, తనకు న్యాయం జరగడంలేదని ఈ సందర్భంగా నవీన్ తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్సై నాగుల ఉపేందర్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి చేరుకొని కారే నవీన్ కు నచ్చ చెప్పారు.

అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి చనిపోతానని నవీన్ హెచ్చరించాడు. సుమారు అరగంట పాటు పోలీసులు అక్కడికి చేరుకున్న ప్రజలు నచ్చజెప్పి అదుపులోకి తీసుకున్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ నవీన్ హెచ్చరించాడు. ఈ విషయంపై పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా న్యాయం జరగలేదని రైతు నవీన్ అన్నారు. గ్రామ పెద్దలు న్యాయం చేయాలని ఆయన కోరారు. కాగా హరిజనులు మాట్లాడుతూ తాతల కాలం నాటి నుండి అదే స్థలం శ్మశాన వాటికగా వాడుతున్నామని, ఇటీవల కాలంలో గ్రామ పెద్దలు ఏడు గుంటల స్థలాన్ని శ్మశాన వాటికకు తీర్మానం చేశారని, అట్టి ఒప్పంద పత్రంలో మధ్యకాలంలో కొనుగోలు చేసిన రైతు కారె నవీన్ కుటుంబ సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయని శ్మశాన వాటిక హక్కుదారులైన హరిజనులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed