Revanth Reddy: నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. సీఎం సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-08-30 07:25:41.0  )
Revanth Reddy: నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. సీఎం సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నా వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని, భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం మరియు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తనకు ఆపాదించబడిన వ్యాఖ్యలను కలిగి ఉన్న 29 ఆగస్టు, 2024 నాటి కొన్ని పత్రికా నివేదికలు.. తాను గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను ప్రశ్నిస్తున్నాను అనే అభిప్రాయాన్ని ఇచ్చాయని అర్థం చేసుకున్నానని అన్నారు.

అయితే తాను న్యాయ ప్రక్రియను గట్టిగా విశ్వసిస్తానని పునరుద్ఘాటించారు. పత్రికా నివేదికలలో ప్రతిబింబించే ప్రకటనల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటువంటి నివేదికలలో నాకు ఆపాదించబడిన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని అన్నారు. న్యాయవ్యవస్థ దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని, భారత రాజ్యాంగం దాని నీతిని దృఢంగా విశ్వసించే వ్యక్తిగా, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని కొనసాగిస్తానని తెలిపారు. కాగా కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్ఎస్ పని చేసిందని, బీఆర్ఎస్, బీజేపీల ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు.

సీఎం వ్యాఖ్యలను కవిత తరుపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇవి కొందరి ఆలోచనల్లో భయాలు రేకెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే రాజకీయ నాయకులను సంప్రదించి తీర్పులు ఇవ్వట్లేదని, న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తాం.. మనస్సాక్షిగానే విధిని నిర్వర్తిస్తామని తెలిపారు. అంతేగాక చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోమని, రాజకీయ నాయకుల నుంచి కూడా అదే ఆశిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story