ముస్లిం ఓటర్లు ఎటు? BRS, కాంగ్రెస్ వ్యూహమిదే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-12 04:55:59.0  )
ముస్లిం ఓటర్లు ఎటు? BRS, కాంగ్రెస్ వ్యూహమిదే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ రాజకీయ పార్టీలతో పాటు ఆ సెక్షన్ ప్రజల్లోనూ నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్‌కు అండగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీకి మద్దతుగా ఉంటారా?.. లేక భిన్నంగా ఆలోచిస్తారా?.. ముస్లింల పట్ల పార్టీలు నిజంగా ప్రేమ చూపిస్తున్నాయా?.. లేక ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే పాకులాడుతున్నాయా?.. సెక్యులర్ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో దేనికి వారు అండగా ఉంటారు?.. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కామన్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించినందున దేనివైపు నిలబడతారు?.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రాష్ట్ర జనాభాలో 14 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలుగుతారు. ముస్లింలలో పట్టు ఉన్న మజ్లిస్ పార్టీ దాదాపుగా హైదరాబాద్ పాత బస్తీకి మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీ పోటీ చేయని చోట ఇంతకాలం బీఆర్ఎస్‌కు ముస్లింలు మద్దతు పలికారు. కర్ణాటక అసెంబ్లీ రిజల్టు తర్వాత రాష్ట్రంలోని ఆ సెక్షన్ ఓటర్లలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఈసారి ముగ్గురు ముస్లింలకు మాత్రమే టికెట్లు ఇవ్వడంపై వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆ సెక్షన్‌కు చెందిన ఎంత మందికి టికెట్లు ఇస్తుందో వేచి చూడాలనే ధోరణితో వారు ఉన్నారు. మైనారిటీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలను ఇస్తుందనే అంశంపైనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘బీ-టీమ్’ కామెంట్లతో..

బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్‌’గా వ్యవహరిస్తున్నదని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. దానికి బలం చేకూర్చేలా జరుగుతున్న పరిణామాలు సైతం ముస్లిం ఓటర్లను సరికొత్త ఆలోచనవైపు నెట్టాయి. హిందుత్వ భావజాలంతో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర బీజేపీపై పడింది. అలాంటి పార్టీతో బీఆర్ఎస్ జతకట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టే అవుతుందనే అభిప్రాయాలు చాలా చోట్ల ముస్లిం ఓటర్ల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో సహజంగా సెక్యులర్ అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బెటర్ అనే ప్రత్యామ్నాయ ఆలోచనకు కారణమవుతున్నది. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో ఇంతకాలం బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ముస్లిం ఓటర్లు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తారనే సాధారణ అభిప్రాయం నెలకొన్నది.

ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రూ.లక్ష సాయాన్ని అందించే స్కీమ్‌ను హడావుడిగా ప్రవేశపెట్టింది. ‘ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే..’ అనే చర్చ ఆ కమ్యూనిటీ ప్రజల్లో వినిపిస్తున్నది. ఈ స్కీమ్‌ను ఎలక్షన్ స్టంట్‌గానే వారు భావిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ముస్లింలకు స్థానం కల్పించకపోవడాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని దాదాపు డజను విశ్వవిద్యాలయాల్లో ఒక్కరు కూడా ముస్లిం లేరంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేవనెత్తిన అంశాన్నీ ముస్లింలు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో 14 శాతం ముస్లిం జనాభా ఉంటే కేవలం మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అవకాశం కల్పించడంపై పెదవి విరుస్తున్నారు. శాసనమండలిలో సైతం మహమూద్ అలీ మినహా ముస్లిం ఎమ్మెల్సీలే లేరని గుర్తుచేశారు.

డిక్లరేషన్ వర్సెస్ రూ.లక్ష సాయం

ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్.. టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదని, కేవలం మూడు స్థానాలకే పరిమితం చేశారన్నది ఆ సెక్షన్ ఓటర్ల ప్రధాన ఆరోపణ. ఈ అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో ఎటు దారితీస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ముస్లిం మైనార్టీలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏకంగా ప్రత్యేక డిక్లరేషన్‌‌ను రూపొందిస్తున్నది. వారిని ఆకట్టుకోడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 40 స్థానాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇందులో పొందుపరుస్తున్నది. షబ్బీర్ అలీ నేతృత్వంలోని కమిటీ దీనిపై కసరత్తు చేస్తున్నది.

మరో వైపు బీఆర్ఎస్ మైనార్టీలకు రూ.లక్ష సాయంపై ఆశలు పెట్టుకున్నది. అది ఏ మేరకు ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుతుందనే చర్చ మొదలైంది. ఓ వైపు కాంగ్రెస్ డిక్లరేషన్, మరో వైపు రూ.లక్ష సాయం ఉండటంతో ముస్లిం ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతున్నది. ఆ సెక్షన్ ఓటు బ్యాంకు కోసం మజ్లిస్‌తో బీఆర్ఎస్ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నా, బీజేపీ తీసుకొస్తున్న కామన్ సివిల్ కోడ్‌కు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించినా ‘బీ-టీమ్’ వాదనలే ముస్లిం ఓటర్లను ఆలోచనల్లో పడేశాయి. మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా ఉన్న ముస్లింలు ప్రదర్శించనున్న వైఖరి రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌లో ప్రకటించే హామీలతో పాటు ఆ కమ్యూనిటీకి చెందినవారికి ఎంత మందికి టికెట్లు ఇస్తుందనేది కూడా కీలకంగా మారింది.

Advertisement

Next Story