YS Sharmila : మోడీ దోస్తులకు విశాఖ స్టీల్ అమ్మే కుట్ర : షర్మిల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
YS Sharmila : మోడీ దోస్తులకు విశాఖ స్టీల్ అమ్మే కుట్ర : షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ(Vizag steelplant)ని దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్ర(Selling Conspiracys)లు జరుగుతూనే ఉన్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని... కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదని విమర్శించారు. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని షర్మిల ఆరోపించారు.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించి స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారని గుర్తు చేశారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని దుయ్యబట్టారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే జేడీఎస్ రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే..ఎన్డీఏకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయన్నారు. 18 మంది ఏపీ ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని, ఇది నిజంగా సిగ్గు చేటని, మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనమని షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు.

ఫ్యాక్టరీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలంటున్నారని, ఇదెక్కడి న్యాయమని షర్మిల ప్రశ్నించారు.

కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని, ప్లాంట్ ను సెయిల్(SAIL)లో వెంటనే విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలని, భవిష్యత్ లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని, ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed