కాంగ్రెస్ మేనిఫెస్టోకు ముహుర్తం ఫిక్స్! ఖర్గే చేతుల మీదుగా రిలీజ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-16 07:18:06.0  )
కాంగ్రెస్ మేనిఫెస్టోకు ముహుర్తం ఫిక్స్! ఖర్గే చేతుల మీదుగా రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఇస్తున్న హామీలకు మెరుగులు దిద్దుతూ కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుండగా రేపు పూర్తి స్థాయి మేనిపెస్టోను విడుదల చేయబోతున్నది. రాష్ట్ర పర్యటనకు రాబోతున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలు

హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్ర కసరత్తు చేస్తోంది. తమకు అధికారం అప్పగిస్తే ఏం చేయబోతున్నామనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రజలు, వివిధ వర్గాల నేతలు, సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. వాటన్నింటిని క్రోడీకరించుకుని బీఆర్ఎస్‌కు ధీటైన పథకాలను అనౌన్స్ చేస్తామని ఆ పార్టీ నేతలే చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి, కాంగ్రెస్ రైతు భరోసా, తెలంగాణ గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, కాంగ్రెస్ చేయుత పేరుతో ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అనౌన్స్ చేయగా వీటికి అదనంగా ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ క్రమంలో ప్రస్తుతం అమలు అవుతున్న కళ్యాణ లక్ష్మికి అదనంగా పెళ్లి కూతురుకి తులం బంగారం ఇస్తామని పార్టీ ముఖ్యనేతలు ప్రకటించారు. మరోవైపు రైతు, నిరుద్యోగ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలకు తామేమి చేయబోతున్నామో వివరించింది. ఈ ఆరు గ్యారెంటీలే తమ కథానాయకులు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న తరుణంలో రేపటి పూర్తి స్థాయి మేనిఫెస్టోలో వీటికి అధనంగా ఎలాంటి స్కీమ్స్ ప్రకటిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story