కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కూడా లేరు: MP లింగయ్య యాదవ్ ఫైర్

by Satheesh |   ( Updated:2023-08-29 09:13:58.0  )
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కూడా లేరు: MP లింగయ్య యాదవ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని.. ప్రతిపక్షాలు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఆయన తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఆ పార్టీలకు 95% స్థానాల్లో డిపాజిట్ రాలేదని.. ఇప్పుడేమో అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా ఏ సర్వే ఫలితం చూసినా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉందని అన్నారు.

దేశంలో ఎవరూ అభ్యర్థులను ఇంత ముందుగా ప్రకటించరని.. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని ప్రశంసించారు. కేసీఆర్ ప్రకటించిన మా అభ్యర్థులను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అనే కొత్త వేషంతో వస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ వాళ్లను పట్టించుకోలేదని మండిపడ్డారు. దళితులను ఆదుకోవడానికి కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని చెప్పారు. 2018లో 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదన్నారు.

ఇక, ఖమ్మం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారన్నారు. ఇప్పటికే మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల చావులకు కారణం అయ్యారని బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో మీ కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించిన ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చూస్తోందని.. ఇదేనా మీ రైతు భరోసా అని ప్రశ్నించారు. నూకలు తినండని హేళన చేసిన పార్టీ బీజెపీ అని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. 100కు పైగా అసెంబ్లీ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed