కేసీఆర్.. అంటే ఆగడు.. పంటే లేవడు: ఎంపీ లక్ష్మణ్ సెటైర్

by Satheesh |   ( Updated:2023-11-14 15:40:45.0  )
కేసీఆర్.. అంటే ఆగడు.. పంటే లేవడు: ఎంపీ లక్ష్మణ్ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను సీఎం చేస్తే అడుక్కునే పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చారని, బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారని, ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ అభివృద్ధి చెందడమే అని, కాంగ్రెస్.. గాంధీ ఫ్యామిలీ అభివృద్ధి మాత్రమేనని ఎద్దేవా చేశారు. కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదని ఆయన ఫైరయ్యారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితితో బీఆర్ఎస్ సర్కార్ ఉందని ఆయన ధ్వజమెత్తారు. అంటే ఆగడు.. పంటే లేవని వ్యక్తి కేసీఆర్ అని సెటైర్లు వేశారు.

10 ఏండ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాలకు మాత్రమే పరిమితమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఉందని ఆయన చురకలంటించారు. ఈరెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమేనని విరుచుకుపడ్డారు. పూటకో అవినీతికి ఈ పార్టీలు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని, అయితే గతంలోని నిరుద్యోగ భృతి ఎందుకు అమలుచేయలేదని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా పదేళ్లు నిద్రపోయి.. పగటి వేష గాళ్లలాగా ఓట్లు అడుక్కునేందుకు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. గుంటనక్కలా మారారని ఫైరయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వంత పాడే పార్టీ మజ్లీస్ అని, వీరంతా తోడు దొంగలు.. గజ దొంగలని ఆయన విమర్శలలు చేశారు. తమది పీపుల్స్ మేనిఫెస్టో అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని వెల్లడించారు. ఇతర పార్టీల్లాగా అమలుకు సాధ్యంకాని హామీలు తాము పొందుపరచలేమని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళొద్దని కోరుకుంటున్నానని విజయశాంతిని ఉద్దేశించి ఆయన చెప్పారు. కానీ వారి వ్యక్తిగత అవసరాల కోసం తాము మాత్రం చేసేదేముందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మోసం చేయడం వల్లే విజయశాంతి బీజేపీలోకి వచ్చారని, మళ్ళీ అక్కడికే వెళ్తారని తాను అనుకోవడం లేదన్నారు.

Advertisement

Next Story