మహిళా రిజర్వేషన్ పేరుతో సీఎం కేసీఆర్ మరో కొత్త డ్రామా: MP లక్ష్మణ్ ఫైర్

by Satheesh |
మహిళా రిజర్వేషన్ పేరుతో సీఎం కేసీఆర్ మరో కొత్త డ్రామా: MP లక్ష్మణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే దాన్ని 22 శాతానికి తగ్గించి కేసీఆర్ బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. ఈనెల 17వ తేదీన పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో థ్యాంక్యూ మోడీజీ పేరిట లక్ష్మణ్ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఫైరయ్యారు. బీఆర్ఎస్‌లో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థానం ఏంటో ఎమ్మెల్సీ కవిత కూడా ఒకసారి చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో 11 మంది మహిళా మంత్రులు, 8 మంది మహిళా గవర్నర్లు ఉన్నారని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌ను మళ్లీ నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని లక్ష్మణ్ తెలిపారు. సీఎం కేసీఆర్ 115 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారని, అందులో బీసీలకు, మహిళలకు కేటాయించిన సీట్ల లెక్క చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. ఇదిలాఉండగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షం కాంగ్రెస్ నాయకుడు ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ కాషాయతీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed