కాంగ్రెస్ పాలనలో వేలమంది రైతు ఆత్మహత్యలు: ఎంపీ ఈటల రాజేందర్

by Satheesh |
కాంగ్రెస్ పాలనలో వేలమంది రైతు ఆత్మహత్యలు: ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వతంత్ర భారతంతో 50 ఏండ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందని, వారి పాలనలో దేశంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో తొలిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 వరకు వ్యవసాయం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆయన ఫైరయ్యారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయలేదని ధ్వజమెత్తారు. మోడీ ప్రధాని అయ్యాక 2014-15లో రూ.1360 ఉన్న కనీస మద్దతు ధరను రూ.2320కు పెంచారని ఈటల తెలిపారు. ప్రతిపక్ష నేతలు వ్యవసాయం, నిరుద్యోగం, సోషల్ జస్టిస్ అంటూ అనేక మాటలు చెప్పారని ఎద్దేవాచేశారు. సోషల్ జస్టిస్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

సహజసిద్ధమైన వ్యవసాయం ద్వారా దిగుబడి తగ్గవచ్చని, కానీ కేన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని మోడీ సర్కార్ ఈ ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దళితుడు, గిరిజనుడు, ఓబీసీ కానీ ముఖ్యమంత్రి అయింది లేదన్నారు. 2014, 2019లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో అపోజిషన్ గౌరవం కూడా దక్కలేదని ఈటల చురకలంటించారు. అప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా కూడా లేరని, ఈసారి ప్రతిపక్ష హోదా రాగానే రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారని రాజేందర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగుల కోసం ఆలోచన చేసి.. శిక్షణ కోసం నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తాను మాజీ ఆర్థికమంత్రినని, కాంగ్రెస్ నేతలు ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని, పనికొచ్చే బడ్జెట్ కాదని విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. వారు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఈటల కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed