జనంలోకి రాబోతున్న MLC కవిత.. తొలి ప్రోగ్రామ్ ఇదే!

by Gantepaka Srikanth |
జనంలోకి రాబోతున్న MLC కవిత.. తొలి ప్రోగ్రామ్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనంలోకి కవిత రాబోతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సైలెంట్ ‌గా ఉన్నారు. రాజకీయ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. జైలునుంచి వచ్చిన 3 నెలల తర్వాత కేంద్రంపై ఎక్స్ వేదికగా విమర్శలకు పదును పెట్టింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై విమర్శల స్పీడ్ పెంచనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ నేతలతోనూ, కులసంఘాలతోనూ భేటీ కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో వారి పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

జైలు నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాలు సమస్యలపై స్పందించడం లేదని, కనీసం మీడియా ముందుకు కూడా ఎందుకు రాదడం లేదని సర్వత్రా చర్చనీయాంశమైంది. వాటన్నింటికి చెక్ పెడుతూ ఎక్స్ వేదికగా అదానీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్క సారిగా ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాఫిక్ గా మారారు. ఇక నుంచి ప్రజాసమస్యలపై ఘాటుగా స్పందించనున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, బీఆర్ఎస్ నేతలపై మోపుతున్న కేసులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా నిధులు, కేటాయింపుల్లో అన్యాయం, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇలా అన్ని అంశాలను ఎండగట్టేందుకు అంశాల వారీగా ప్రణాళికలు సైతం రూపొందించినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’పై విమర్శలు చేయనున్నట్లు విమర్శలు చేయనున్నట్లు సమాచారం.

జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం ఆరోపణలతో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో సీబీఐ సైతం కేసు నమోదు చేసింది. ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 164 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఆతర్వాత ఆమె గైనిక్ సమస్యలతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉన్నారని సమాచారం. దాదాపు 3 నెలల పాటు కుటుంబ సభ్యులతోనే గడిపారు. ఒక్క రాజకీయ విమర్శ సైతం చేయలేదు. ప్రస్తుతం సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం విషయంలో గురువారం ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అదానీ వ్యవహారంపై మండిపడ్డారు. అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేడర్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి నుంచి ప్రజాక్షేత్రంలోకి..!

ఒక వైపు సోషల్ మీడియా, మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, కేడర్ తోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అప్పటివరకు ఇంకా ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోనే ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అంతకు ముందే వచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు ఇతర కులసంఘాల ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నట్లు సమాచారం.

26న బీసీ డెడికేషన్ కమిషన్ కు వినతి

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేతో ఏ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు.. వారి ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ సైతం ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ సైతం త్వరగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు వినతిపత్రం అందజేసింది. ఎమ్మెల్సీ కవిత సైతం జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్దంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

అదే విధంగా ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్ష దివస్ లో సైతం కవిత పాల్గొనబోతున్నారు. ఇంకా ఆమె ఏ జిల్లాలో పాల్గొనే అంశంపై క్లారిటీ రాలేదని సమాచారం. ఈనెల 22న జాగృతి ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో అనుసరించబోయే అంశాలను చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా, కవిత రాకతో కేడర్ తో జోష్ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అదానికో న్యాయం?.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత

అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవ‌హారంపై ఎక్స్ వేదికగా గురువారం ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అని మండిపడ్డారు. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని ప్రధానిని నిలదీశారు.

Advertisement

Next Story