నేడు విచారణకు MLC కవిత.. ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్..!

by Mahesh |   ( Updated:2023-03-11 03:38:42.0  )
నేడు విచారణకు MLC కవిత.. ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు శనివారం ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50, 54 ప్రకారం జారీ చేసిన నోటీసుల్లో భాగంగా ఎంక్వయిరీకి అటెండ్ అవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానున్నది. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు ప్రస్తావనపై తీవ్రమైన అభియోగాలు మోపిన నేపథ్యంలో ఆమెను ఈడీ విచారిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన ఈడీ వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. మరికొద్ది మంది నుంచి కూడా వాంగ్మూలాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కవితకు ఉన్న ప్రమేయం గురించి ఈడీ మరింత లోతుగా ప్రశ్నించనున్నది.

న్యాయనిపుణులతో చర్చలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో దీక్ష పూర్తి చేసుకున్న అనంతరం ఈడీ విచారణ ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. ఈడీ ప్రశ్నలు? వాటికి సమాధానాలు ఎలా చెప్పాలి? రికార్డ్ స్టేట్ మెంట్ లో ఎలా వ్యవహరించాలి? తదితర అంశాలపై కసరత్తు చేసినట్లు సమాచారం.

జాయింట్ ఎంక్వయిరీ?

ఎంక్వయిరీలో కవిత ఎలాంటి సమాధానాలు ఇస్తారు? క్రాస్ ఎగ్జామినేషన్ అవసరం ఏ స్థాయిలో ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి. సౌత్ గ్రూప్ తరపున ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు వెళ్లాయని ఈడీ స్పష్టమైన నిర్ధారణకు రావడంతో ఇప్పటికే పలువురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని వివరాలతో పోల్చుకుని కవితను ప్రశ్నించే అవకాశమున్నది. కవితకు తాను బినామీ అని స్వయంగా పిళ్లయ్ వ్యాఖ్యానించారని తాజా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొనడంతో పెట్టుబడులపై అవసరాన్ని బట్టి ఆయనతో కలిపి జాయింట్ ఎంక్వయిరీ చేసే అవకాశమున్నట్లు ఈడీ వర్గాల సమాచారం.

అంతేకాకుండా ఈడీ కస్టడీలోనే ఉన్న మనీష్ సిసోడియాతో కలిపి కవితను విచారించే అవకాశాన్ని కూడా తోసి పుచ్చలేమని ఈడీ వర్గాలు వివరించాయి. సిసోడియా, కవిత నుంచి వచ్చే సమాధానాలతో సంతృప్తి చెందకపోతే ముగ్గురినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ తరహాలో వాస్తవాలను బయటకు లాగడంపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశమున్నది. రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సిసోడియా కస్టడీ గురించి ఈడీ లేవనెత్తిన వాదనల సందర్భంగా జాయింట్ ఎంక్వయిరీ గురించి సూచనప్రాయంగా ప్రస్తావించిన నేపథ్యంలో దీనిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

సాయంత్రం తర్వాత ఏం జరగనున్నది?

లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలు కాకపోయినప్పటికీ సౌత్ గ్రూపులో కీలక భూమిక పోషించారని ఈడీ భావిస్తున్నది. ఎంక్వయిరీలో ఆమె ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారులు లేవనెత్తే ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పకపోయినా, దాటవేసే తీరులో బదులిచ్చినా, ఆమె చెప్పే సమాధానాలకు ఆఫీసర్లు సంతృప్తి చెందకపోయినా తదుపరి ఎలాంటి చర్యలుంటాయనే చర్చలు మొదలయ్యాయి. సాయంత్రం కల్లా ఎంక్వయిరీ పూర్తయిన తర్వాత కవితను మరోసారి కూడా విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇస్తుందా.. లేక సమాధానాలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే దాటవేస్తున్నారనే కారణంతో ఆమెను అరెస్టు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో, ఢిల్లీలోని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. సాయంత్రం తర్వాత ఏం జరుగబోతుందనేదే ఆ చర్చల్లోని సారాంశం. కవితను అరెస్ట్ చేసినా చేయొచ్చని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

విపక్షాలు సపోర్ట్ చేస్తాయా?

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో దాదాపు డజను పార్టీల నుంచి కవిత మద్దతు కూడగట్టుకోగలిగారు. లిక్కర్ స్కామ్ లో ఆమె పట్ల ఈడీ కఠినంగా వ్యవహరిస్తే ఎన్ని పార్టీలు ఆమెకు సపోర్టుగా ఉంటాయనే చర్చ మొదలైంది. ఇప్పటికే మనీష్ సిసోడియా అరెస్టును కేసీఆర్ ఖండించారు. మరో ఏడు పార్టీల మద్దతు కూడగట్టి ప్రధానికి లేఖ రాసేలా ఉమ్మడి ప్లాట్‌ఫాంను ఆ అంశంపై ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు కవిత విషయంలో ఆ పార్టీలు బీఆర్ఎస్‌కు అండగా ఉంటాయా.. కవితను అరెస్టు చేస్తే ఖండిస్తాయా.. అనే చర్చలు తెరపైకి వస్తున్నాయి. భారత్ జాగృతి కార్యకర్తలు ఇప్పటికే ఢిల్లీ దీక్ష కోసం అక్కడే ఉన్నందున సాయంత్రం తర్వాత ఈడీ అనూహ్య చర్యలకు పాల్పడితే ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది

Read more:

బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రధారి ఆమె.. సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ!

Advertisement

Next Story

Most Viewed