ఆ విషయంలో ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? MLC Kalvakuntla Kavitha

by Satheesh |   ( Updated:2023-02-06 13:13:31.0  )
ఆ విషయంలో ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? MLC Kalvakuntla Kavitha
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు అదానీ సంస్థల షేర్ల విలువ పడిపోతుంటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అదానీతో పాటు ఎల్ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల షేర్ల విలువ భారీగా పడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగానే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటన్నారని ప్రశ్నించారు.

ఏ ప్రభుత్వం మద్ధతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికీ తెలుసన్నారు. అదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి స్పూర్తిదాయకం అన్నారు. కేంద్ర బడ్జెట్ నిరుత్సాహ పరిచేదిగా ఉంటే కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్ఫూర్తినిస్తున్నదని తెలిపారు.

రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

Read More.. Telangana budget 2023 : బడ్జెట్‌పై కేసీఆర్‌ స్టైళ్లో స్పందించిన బండి సంజయ్

Advertisement

Next Story

Most Viewed