Rakesh Reddy: దీవాన్ దాబా వద్ద దానం బీడీలు అమ్ముకున్నాడు

by Gantepaka Srikanth |
Rakesh Reddy: దీవాన్ దాబా వద్ద దానం బీడీలు అమ్ముకున్నాడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఢిల్లీ సుల్తాన్లకు మెగా కృష్ణారెడ్డి సూట్‌ కేసులు అందాయని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో మెగాపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ఏమాత్రం మాట్లాడలేదని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటై తమ గొంతు నొక్కేశాయని మండిపడ్డారు. బీఆర్ఎస్‌పై గత అసెంబ్లీ సెషన్ లో కాంగ్రెస్ అనేక అవినీతి ఆరోపణలు చేసిందన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దీవాన్ దాబా వద్ద బీడీలు అమ్ముకున్న దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకున్నారోనని ఎద్దేవా చేశారు.

రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ విధానాలు ముస్లింలకు అనుకూలంగా ఉంటున్నాయని పైడి రాకేశ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చిన చరిత్ర కాంగ్రెస్ ది అని ధ్వజమెత్తారు. కచ్ దీవులు అమ్మిన హిస్టరీ కాంగ్రెస్ కు ఉందని విరుచుకుపడ్డారు. చైనాతో యుద్ధం జరిగితే రాహుల్ తాత డ్యాన్స్ చేశారని సెటైర్లు వేశారు. శ్రీలంకలో తమిళులను చంపేందుకు సైనికులను పంపారని, దేశ భద్రతకు కాంగ్రెస్ ముప్పు తెస్తుందని పైడి రాకేశ్ రెడ్డి తెలిపారు. ముస్లిం సమాజం కోరిక మేరకే వక్ఫ్ బోర్డు సవరణలు చేశారని, ముస్లింలంటే ఎంఐఎం మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు.

హిందువు-ముస్లింల మధ్య ఎంఐఎం చిచ్చుపెట్టొద్దని సూచించారు. వక్ఫ్ బోర్డు భూముల భద్రత కేంద్ర ప్రభుత్వానిదని పైడి పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీకి 80 సీట్లు రావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ధీమా వ్యక్తంచేశారు. ఇది తాము చెప్పడం లేదని, తమతో కొంతమంది కాంగ్రెస్ నేతలే చెప్పారని వివరించారు. 8 నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజలు విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న నాలుగేళ్లు తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామన్నారు. దేశ ద్రోహులు, హిందూ ద్రోహులు తెలంగాణలో తాము అధికారంలోకి రావొద్దని కోరుకుంటాయని పైడి రాకేశ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed