విద్యుత్ కొనుగోళ్లలో తప్పులు జరిగాయి.. కమిషన్ విచారణలో కోదండరామ్.. హాట్ కామెంట్స్

by Ramesh N |
విద్యుత్ కొనుగోళ్లలో తప్పులు జరిగాయి.. కమిషన్ విచారణలో కోదండరామ్.. హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పందం అంశాలల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ కమిషన్ చైర్మన్‌ నరసింహా రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కొదండరామ్ కలిశారు. ఈ సందర్భంగా కొదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రూ. 81 వేల కోట్లు అప్పులపాలు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించిందన్నారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలకు చాలా ఖర్చు అవుతోందన్నారు.

కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని, కానీ ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు రుద్దీ.. తెలంగాణ ప్రజల నెత్తిన టెక్నాలజీ ఉపయోగించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కిందన్నారు. దీన్ని వారు తప్పు బడుతున్నారని, అందుకే ఇలాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకు వెనుకాడకూడదని ప్రభుత్వానికి సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలో తప్పులు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అని కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. పాలకులు చట్టబద్దమైన పాలన అందించాలన్నారు. ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed