- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగానే మేడారం జాతర.. ఏర్పాట్లపై మంత్రుల సమావేశం..
దిశ, ఏటూరునాగారం/ ములుగు : మేడారం మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు అన్నారు. 75 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులపై రాష్ట్ర స్థాయి విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించేందుకు, జాతర అభివృద్ధి పనులను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం ఉదయం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవితి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ములుగు జిల్లా అధికారులు సమీక్షకు హాజరయ్యారు. వీరందరికి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ద్వారా ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు.
తెలంగాణ వచ్చాకే మేడారం జాతరకు గుర్తింపు..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు రూ.332 కోట్లు ఖర్చు చేశామని మంత్రులు తెలిపారు. ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో జరిగే మహాజాతరను విజయవంతం చేసేందుకు ప్రజలు, అధికార యంత్రాంగం భాగస్వామ్యం కావాలని కోరారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు, పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా జాతర నిర్వహిస్తామన్నారు. జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయి అని చెప్పారు. ఓమిక్రాన్, కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు కోటి రూపాయలు కేటాయించామని చెప్పారు. గత జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు జాతరకు వచ్చారని, అయితే ఈ సారి కోటి ముప్పైలక్షల మంది భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6400 టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు.
జాతర మొత్తం 8 జోన్లు.. 34 సెక్టార్లు..
జాతర నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లు గా, 34 సెక్టర్లుగా విభజించినట్లు మంత్రులు తెలిపారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణకు 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 4000 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్ వాహనాలు, సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లను వినియోగించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం 200 డస్ట్ బిన్స్ పెట్టామన్నారు.
50 బెడ్లతో సమ్మక్క - సారలమ్మ వైద్యశాల
జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 50 బెడ్లతో సమ్మక్క సారలమ్మ ప్రత్యేక వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్య శాల, మరో 19 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ములుగులో, ఏటూరునాగారం, పరకాల వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, తాడ్వాయి10 పడకల ఆరోగ్య కేంద్రం, పస్రాలోని 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సు లు, 15 బైక్ అంబులెన్సు లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఒక ఐసోలేషన్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు.
భద్రతకు 10,300 మంది పోలీస్ సిబ్బంది..
ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వియలెన్సే కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా అమర్చినట్లు తెలిపారు. ప్రయాణికులందరికి శానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తామన్నారు. నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాం అన్నారు. జాతరలో నిత్యం వెలుగుల కోసం 4200 ఎల్.ఈ. డి బల్బులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. 10,300 మంది పోలీస్ సిబ్బంది, ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పశ్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు వేయడం జరిగింది అన్నారు. 51 గమ్య స్థానాల నుంచి నడుస్తాయి అన్నారు. 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించామని, 41 క్యు లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
మీడియాకు ప్రైవేటు బస్సులు.. బెస్ట్ ఫొటోకు రూ.లక్ష బహుమతి
మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీడియా సెంటర్ లో వైఫై అవకాశం ఉంటుందని తెలిపారు. 13 సాంస్కృతిక బృందాలతో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత తెలిపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతర సందర్భంగా మంచి ఫోటో లు తీసిన వారిని గుర్తించి రూ.లక్ష బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతూ కవిత, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణారెడ్డి, దనసరి అనసూయ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చొంగ్తు, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్, అటవీ శాఖ పీసీసీఎఫ్ శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, శాంతి, భద్రతల అదనపు డీజీలు జితేందర్, నాగిరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూరు నాగారం అదనపు పి.ఓ వసంత్ రావు, మేడారం ఈ.ఓ రాజేందర్, మేడారం ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.