ఇక నుంచి వారికే రైతుబంధు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by GSrikanth |   ( Updated:2024-04-01 14:11:51.0  )
ఇక నుంచి వారికే రైతుబంధు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఐదెకరాల మేర సాగుచేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడిగా రైతుబంధు ఇప్పటికే జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదెకరాల వరకు భూములున్న 64.75 లక్షల మంది రైతులకు 5574.77 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగిలారని వారికి కూడా త్వరలో రైతుబంధు జమ చేస్తామని చెప్పారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 92 శాతం ఉన్నారని వాటికి రైతుబంధు జమ చేశామని, మిగతా 8 శాతం కూడా పూర్తి చేస్తామన్నారు.

రైతుబంధు‌పై అసెంబ్లీలో చర్చిస్తాం..

పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలు, సూచనలు తీసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొందరు రియల్ వ్యాపారులకు, సాగుచేయని భూములకు, ఔటర్ భూములకు, గుట్టలు, పుట్టలు, వ్యవసాయం చేయని భూములకు రైతుబంధు వస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నింటిని ప్రక్షాళన చేసి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. నిజమైన రైతుల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా అర్హులకు తప్పకుండా రైతుబంధు అందజేస్తామని పేర్కొన్నారు. పంట పెట్టుబడి పంటలు సాగుచేస్తున్న రైతులకు మాత్రమే ఇస్తామన్నారు. రుణమాఫీ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వచ్చే వానాకాలం పంట నాటికి అందరి నిర్ణయాలు తీసుకుని అసెంబ్లీలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బీఆర్ఎస్ పోటీ కాదు...

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమకు ఏ మాత్రం పోటీ కాదని తుమ్మల తెలిపారు. 12 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలువబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం అస్తవ్యస్తం చేశారని, తమ ప్రభుత్వం ఇప్పడిప్పుడే గాడిలో పెడుతున్నదని పేర్కొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆశీర్వదిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

తాగునీటిపై ప్రత్యేక దృష్టి..

ఎండాకాలం నేపథ్యంలో తాగునీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూసుకుంటామని చెప్పారు. సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ నింపుతామని చెప్పారు. అప్పటికప్పుడే సీఎస్, అధికారులతో మాట్లాడి సాగర్ జలాలు వదలాలని కోరడంతో అధికారుల ఆ మేరకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రెండుమూడు రోజుల్లో సాగర్ జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి రానున్నాయి. సాగు, తాగునీటి కష్టాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, మూడు నెలల క్రితం చేపట్టిన ప్రభుత్వం ఎలా కారణమవుతుందని దుయ్యబట్టారు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని నాటి సీఎం కేసీఆర్‌కు చెప్పానని, ఐనా పట్టించుకోకుండా నేటి దుస్థితికి కేసీఆర్ కారణమయ్యాడని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో పూర్తిచేసి వినియోగం లోకి తెస్తామన్నారు.

40 ఏండ్ల క్రితం భోజనం పెట్టాడని..


గుబ్బల మంగమ్మ దర్శనం నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతుండగా.. కోనాయిపాలేం గ్రామానికి చెందిన 85 ఏండ్ల చిలుకూరి సత్యనారాయణ వచ్చి కనిపించగా.. తుమ్మల ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. 40 ఏండ్ల క్రితం ఆ ప్రాంతంలో తిరిగిన తనకు ఆకలి కావడంతో సత్యనారాయణను అడగ్గా భోజనం పెట్టాడని గుర్తుచేశాడు. అనంతరం కార్యక్రమం పూర్తయ్యాక దారిలో సత్యనారాయణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు.

Advertisement

Next Story

Most Viewed