Minister Sridhar Babu: ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ప్రస్తుతం మీ సేవా ద్వారా ఆన్ లైన్‌లో అందిస్తున్న సేవలకు అదనంగా మరిన్ని సేవలను ఆన్ లైన్‌లో తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామని, దీనిపై ఎవరూ సందేహపడనవసరం లేదని శ్రీధర్ బాబు అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయదని, ఒకదాని తర్వాత ఒకటిగా హామీలకు కార్యరూపం ఇస్తామని వెల్లడించారు. సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో మీ-సేవ 14వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆరెస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేసి వెళ్లారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో పరిపాలనను గాడిలో పెట్టి ప్రజలకు అధ్బుత ఫలితాలను అందిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి పక్షాలు ప్రజలలో అనుమానాలు రేకెత్తించేందుకు నానా రకాల అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రజలు ఆ పార్టీల మాటలను విశ్వసించవద్దని సూచించారు. ప్రతి పనికి మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 2011లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల సౌకర్యం కోసం పారదర్శకమైన మీ సేవ ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేసారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సేవలతోపాటు మరి కొన్నిటిని కూడా త్వరలో ప్రవేశ పెడతామని వెల్లడించారు. మీ సేవ సిబ్బంది మరింత వినమ్రత, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. మీ సేవ నిర్వాహకులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 4,754 మీ సేవ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం, ఉద్యోగ భద్రత గురించి ఫెడరేషన్ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో టీజీటీఎస్ సి ఛైర్మన్ మన్నె సతీశ్, మీసేవ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ డైరెక్టర్లు వరలక్ష్మి, విజయ్ భాస్కర్, భాస్కర్, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, నేతలు అబ్దుల్ మహ్మద్, బాలరాజు, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story