డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటివారైనా నో కాంప్రమైజ్: మంత్రి సీతక్క

by Satheesh |
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటివారైనా నో కాంప్రమైజ్: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పాకళా వేదికలో అంత‌ర్జాతీయ మాద‌క ద్రవ్యాల దుర‌ల‌వాటు-అక్రమ ర‌వాణా వ్యతిరేక దినోత్సవం ను పురస్కరించుకొని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, డీఈపీడబ్ల్యూడీ ఆద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సకల జీవ కోటిలో మానవ జన్మ ఉన్నతమైందన్నారు. కానీ చెడు అలవాట్ల ద్వారా అనారోగ్యం పాలై చాలా మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని, ఉగ్రవాదం త‌ర్వాత ప్రపంచానికి మాద‌క ద్రవ్యాల వినియోగం అంతటి పెను స‌వాలుగా మారిందన్నారు. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారన్నారు.

మాద‌క ద్రవ్యాలు, మ‌త్తు ప‌దార్థాలు.. శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడమేకాక, సమాజంలో నైతిక విలువలను దారుణంగా దిగజారుస్తున్నాయన్నారు. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో పాఠ‌శాల‌, కళాశాలల విద్యార్థులకు చేరడం ఆందోళ‌న క‌లిగిస్తోందన్నారు. మాద‌క ద్రవ్యాల నియంత్రణ‌కు టీజీ నాబ్ బ‌లోపేతం చేసేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు. టీజీ నాబ్, ఎక్సైజ్, పోలీస్, రైల్వే పోలీస్ శాఖ‌లు బహుముఖ వ్యూహంతో, సమ‌న్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ రవాణాను సమర్ధంగా నిరోధించడం, తయారీదారులు, రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక కార్యాచరణ అమ‌లు చేస్తామన్నారు.

రైతులు, మహిళలు, యువజన సంఘాలు డ్రగ్స్ మ‌హ‌మ్మారిపై పోరాడాలని పిలుపు నిచ్చారు. క్షణికావేశంలో చేసే తప్పిదాల వల్ల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని గుర్తెరిగి నడుచుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియ‌న్ విమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలి రాజ్, సీనియ‌ర్ న‌టులు సుమ‌న్, శ్రీ తేజ సజ్జ, డీజీపీ ర‌వి గుప్తా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీధ‌ర్, డీసీఏ డైరెక్టర్ క‌మ‌లాస‌న్ రెడ్డి, డీఈపీడబ్య్లూడీ డైరెక్టర్ శైల‌జ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed