కేంద్రం సంక్షేమ నిధుల‌ను పెంచాలని ఆగ్రా సదస్సులో కోరిన మంత్రి సీతక్క

by Mahesh |
కేంద్రం సంక్షేమ నిధుల‌ను పెంచాలని ఆగ్రా సదస్సులో కోరిన మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా సంక్షేమ నిధుల‌ను పెంచాల‌ని తెలంగాణ పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ‌త పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితంతుల నెల‌వారి పెన్షన్ మొత్తాన్ని పెంచ‌లేద‌ని గుర్తు చేశారు. వృద్దులు, వితంతులకు నెల‌కు రూ. 200, విక‌లాంగుల‌కు రూ. 300 కేంద్రం ఇవ్వడం వ‌ల్ల ఆ ప‌థ‌కం ల‌క్ష్యం నెర‌వేర‌డం లేద‌న్నారు. ఇక పేద వ‌ర్గాల‌కు సంబంధించిన పలు స్కీంల్లో కేంద్ర ప్రభుత్వం కోత‌లు విధించ‌డాన్ని సీత‌క్క సరికాదన్నారు. యూపీలోని ఆగ్రాలో రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక న్యాయం, సాధికార‌త స‌ద‌స్సులో మంత్రి సీత‌క్క మంగళవారం ప్రసంగించారు.

పేద‌లు, అట్టడుగు వ‌ర్గాల ప్రజ‌ల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని ప్రజా ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలను వివ‌రించారు. దీంతో పాటు కేంద్ర ప‌థ‌కాల నిధులను పెంచాల్సిన అవ‌స‌రాన్ని సీత‌క్క ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తం ప‌ది నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఇటు రాష్ట్ర అవ‌సరాల‌ను నివేదించ‌డంతో పాటు అటు కేంద్ర ప‌థ‌కాల్లో లోటు పాట్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖ‌రిని సీత‌క్క స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, వ‌యో వృద్దులు, డ్రగ్స్ బాధితులు, ట్రాన్స్ జెండ‌ర్లు, ఆదివాసీలు, సంచార జాతులు, ఆర్థికంగా వెనుకబడినవర్గాలు, దివ్యాంగుల సంక్షేమంపై ఆగ్రా సద‌స్సులో ప్రధాన చ‌ర్చ జ‌ర‌గ్గా.. ఆయా వ‌ర్గాల‌కు తెలంగాణ‌లో అమ‌లవుతున్న ప‌థ‌కాల‌ను మంత్రి సీత‌క్క వివ‌రించారు.

దివ్యాంగుల‌కు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్ షిప్పులు, ఆద‌ర్శ వివాహాల‌కు రూ, ల‌క్ష న‌గ‌దు ప్రొత్సహాకాలు, దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ. 5 ల‌క్షల వ‌ర‌కు ఆర్థిక స‌హ‌కారం, రూ. 50 కోట్ల బడ్జెట్‌తో దివ్యాంగుల ప‌రికారాలు, వాహ‌నాల‌ పంపిణీ, వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక హ‌స్టల్లు, ప్రత్యేక హెల్పైన్, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, వ‌యోవృద్దుల ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌, విచార‌ణ కోసం ప్రత్యేక యంత్రాంగం, ట్రాన్స్ జెండ‌ర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు, వారి ఉపాధి కోసం రెండు ల‌క్షల వ‌ర‌కు ప్రత్యేక ప్యాకేజీ, స్కిల్ సెంట‌ర్లు, ప్రత్యేక వైద్య స‌దుపాయాలతో పాటు ఆయా వ‌ర్గాల‌కు అందిస్తున్న చేయుత పెన్ష‌న్ల వివ‌రాల‌ను మంత్రి సీత‌క్క ప్రస్తావించారు. తెలంగాణ‌ను డ్రగ్స్, గంజాయి ర‌హిత రాష్ట్రంగా మార్చేందుకు త‌మ ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్యల‌ను సీత‌క్క వివ‌రించారు. మిష‌న్ ప‌రివ‌ర్తన నినాదంతో పాఠశాలలు, కళాశాలలు, ప‌ని ప్రాంతాల్లో అవ‌గాహ‌న కార్యక్రమాలు చేప‌డుతున్నట్లు చెప్పారు. విద్యా శాఖలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మత్తు పదార్థాల ప్రమాదాలపై ఇప్పటికే 10 ల‌క్షల మంది యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్లు తెలిపారు.

సీత‌క్కను అభినందించిన కేంద్ర మంత్రి, ప‌లు రాష్ట్రాల మంత్రులు

ఈ స‌ద‌స్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌తల శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను మంత్రి సీత‌క్క శాలువాతో స‌త్కరించారు. త‌ర‌చు ఇటువంటి స‌ద‌స్సుల‌ను నిర్వహించ‌డం ద్వారా అట్టడుగు వ‌ర్గాల ఆకాంక్షల‌ను తెలుసుకోవ‌డంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెంచిన వార‌మ‌వుతామ‌ని సీత‌క్క పేర్కొన్నారు. సీత‌క్క ప‌ది నిమిషాల పాటు చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, ప‌లు రాష్ట్రాల మంత్రులు అభినందించారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, కేంద్ర ప‌థ‌కాల్లో చేయాల్సిన స‌వ‌ర‌ణ‌ల‌ను ఎవ‌రి మ‌న‌సును నొప్పించ‌కుండా చాలా స‌హేతుకంగా వివ‌రించినందుకు మెచ్చుకున్నారు. కేవ‌లం రాష్ట్రానికే ప‌రిమితం కాకుండా.. దేశంలో అట్టడుగు వ‌ర్గాల ఆకాంక్షలు చెప్పడంతో పాటు.. కేంద్ర ప‌థ‌కాలను మెరుగు పర‌చ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌ను మంత్రి సీత‌క్క సూచించ‌డంతో ప‌లు రాష్ట్రాల మంత్రులు సీత‌క్క ను ప్రత్యేకంగా క‌లిసి అభినంద‌లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed