Aaditya Thackeray: బాంద్రాలో తొక్కిసలాట.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పై శివసేన విమర్శలు

by Shamantha N |
Aaditya Thackeray: బాంద్రాలో తొక్కిసలాట.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పై శివసేన విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటపై శివసేన(యూబీటీ) మండిపడింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై విమర్శలు గుప్పించింది. దేశంలో "అసమర్థ మంత్రులు" అధికారంలో ఉండటం సిగ్గుచేటని నిప్పులు చెరిగింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన మంత్రి "అసమర్థతను" ప్రతిబింబిస్తుందని అన్నారు. “రీల్ మంత్రి రైల్ మంత్రి అయితే ఇలానే జరుగుతోంది. ప్రస్తుత రైల్వే మంత్రి ఎంత అసమర్థుడో బాంద్రాలో జరిగిన ప్రమాదమే చెబుతోంది. బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల కోసం అశ్విని వైష్ణవ్ జీని బీజేపీ ఇన్ ఛార్జిగా నియమించింది. కానీ, ప్రతి వారం ఇలాంటి ప్రమాదాలే జరుగుతున్నాయి. ఇలాంటి, అసమర్థ మంత్రుల పాలనలో మన దేశం ఉండటం చాలా అవమానకరమని” ఆయన మండిపడ్డారు.

బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు గాయపడినవారిని ముంబైలోని భాభా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన తొమ్మదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉదయం 5.56 గంటలకు ఈ ఘటన జరిగింది.

Advertisement

Next Story

Most Viewed