సర్పంచులను పాడెనెక్కించిందే బీఆర్ఎస్ : హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్

by M.Rajitha |
సర్పంచులను పాడెనెక్కించిందే బీఆర్ఎస్ : హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాసేవకులు సర్పంచులను పాడెనెక్కించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి సీతక్క మండిపడ్డారు. సర్పంచుల గురించి బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరమని, హరీష్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అధికారం పోయిందన్న అక్కసు తప్ప పల్లెలపై వారికి ఏమాత్రం ప్రేమ లేదన్నారు. గురువారం మంత్రి సీతక్క మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నిజంగా బీఆర్ఎస్ వారికి సర్పంచులపై ప్రేమ ఉంటే, గడచిన పదేండ్లలో గ్రామ పంచాయతీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలే అయ్యిందని, ఈ తక్కువ కాలంలోనే స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం ఎంతో చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ పనితీరును ప్రశంసించాల్సింది పోయి బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలను బాగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఏండ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో గ్రామపంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు. తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండన్నట్టు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయించి వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. కనీసం ఉపాధి హామీ బకాయిలను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రాష్ట్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి రూ.940 కోట్ల బిల్లులను తమ నెత్తి మీద రుద్దిపోయారన్నారు. ఇలా ఎన్నో రకాలుగా బిల్స్ పెండింగ్ లో పెట్టారన్నారు. రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా హరీష్ రావుకి పెండింగ్ బిల్లుల బాగోతం తెలుసు అన్నారు. అయినప్పటికీ పదేపదే వాస్తవాలను వక్రీకరించడం అంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందన్నారు. అయినప్పటికీ వాటన్నిటిని ఒక్కొక్కటిగా తాము చెల్లిస్తూ వస్తున్నట్టు చెప్పారు. అయినా తమ ప్రభుత్వం మీద రాజకీయ కారణాలతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు నయా పైసా చెల్లించలేదన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను పక్కదారి పట్టించినట్లు అవాస్తవాలను మాట్లాడటాన్ని తమ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. గ్రామ పంచాయతీలకు తాము ఏమి చేశామో ప్రజలకు తెలుసు అన్నారు. 15 ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి రూ.431.32 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేశామని, దానికి అదనంగా రూ. 323.99 కోట్ల సీఆర్డీ నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేశామమన్నారు. అయినప్పటికీ తొమ్మిది నెలల్లో 9 పైసలు కూడా విడుదల చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్యుద్ధ కార్మికులకు సంబంధించి వేతనాలు విడుదల చేయలేదనడం పూర్తి అవాస్తవం అన్నారు. పారిశ్యుద్ధ కార్మికుల బకాయిలు 150.57 కోట్ల నిధులను విడుదల చేస్తూ జూలై 15 న ప్రొసీడింగ్స్ ఇచ్చిన సంగతి వారికి తెలియనిది కాదన్నారు. అయినా వాటిని మరుగునపరిచి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.

Next Story