ఇండ్లు లేనివారికి భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Satheesh |
ఇండ్లు లేనివారికి భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ జరుగుతుందని, తప్పనిసరిగా అందజేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు నుంచి వచ్చిన నాయకుడు విజయబాబు అని, ఆయన తన పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉన్నదన్నారు. రాష్ట్రంలోని రైతులకు నీరందించడంలో నీటి పారుదల అభివృద్ధి సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులం అండగా ఉంటామన్నారు. రైతులకు సంబంధించిన టీజీఐడీసీ సంస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కానీ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి కార్యక్రమం తు.చా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు అభివృద్ధిని అందజేస్తున్నామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 31వేల కోట్ల రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రుణ మాఫీ అర్హులందరికీ ప్రభుత్వం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకే అంకితం చేశారన్నారు. గత ప్రభుత్వం నీటి పారుదల, ధరణి ద్వారా రైతుల పట్ల తప్పుడు నిర్ణయాలను తీసుకోగా తాము సరి చేస్తూ చట్ట సవరణలు తెస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా రాగమయి, వేముల వీరేశం, తెల్లం వెంకట్రావ్, మనోహర్ రెడ్డి, చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో పాటు గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్కూ టీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రాణ, ఆస్తీ నష్టం జరుగకుండా సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed