ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. మీ పెద్ద కొడుకులా సమస్యలు తీరుస్తా: పొంగులేటి

by Gantepaka Srikanth |
ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. మీ పెద్ద కొడుకులా సమస్యలు తీరుస్తా: పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా అందరి సమస్యలు తీరుస్తా అని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు ఇచ్చే బాధ్యత కూడా తనదే అన్నారు. అంతేకాదు.. కోడ్ ముగియగానే అర్హులకు కొత్త రేషన్ కార్డులు సైతం మంజూరు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి నమ్మించి మోసం చేసే నైజం తమది కాదని.. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటా అని అన్నారు. కోట్లు ఖర్చు చేసి అయినా సరే తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎవరూ ఆనందంగా లేరని.. ఇప్పుడిప్పుడే అన్ని వర్గాలు కోలుకుంటున్నాయని తెలిపారు.

Advertisement

Next Story