Ponguleti: మాతో గోక్కోవద్దు.. ఖమ్మం గురించి మీకు, మీ మామకు బాగా తెలుసు.. పొంగులేటి ఫైర్

by Prasad Jukanti |
Ponguleti: మాతో గోక్కోవద్దు.. ఖమ్మం గురించి మీకు, మీ మామకు బాగా తెలుసు.. పొంగులేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం మంత్రులు, ఖమ్మం రాజకీయం, ఖమ్మం ప్రజల పౌరుషం గురించి మీకు, మీ మామకు బాగా తెలుసు.. మాతో ఎంత తక్కువ గోక్కుంటే మీకు అంత మంచిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో హరీశ్‌రావు కాంగ్రెస్ మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లో మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీతో పని చేస్తుంటే చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం ప్రజలు హరీశ్‌రావు గానీ ఆయన మామ మాటలను గానీ ఏనాడూ విశ్వసించలేదని స్పష్టంచేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటే వచ్చిందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో మీరు ముక్కు నేలకు రాసినా జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించరని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

మామాఅల్లుళ్లు సమాధానం చెప్పండి

సీతారామ ప్రాజెక్టు తమ హయాంలోనే జరిగిందని చెబుతున్న బీఆర్ఎస్.. ప్రభుత్వం దిగిపోయే సమయానికి కేవలం రూ.703 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పొంగులేటి చెప్పారు. రూ.18,300 కోట్ల అంచనా వ్యయంలో కేవలం రూ.703 కోట్లతోనే 90శాతం పనులు ఎలా పూర్తవుతాయో కేసీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు మోటర్లు వారి హయాంలో బిగించడం వెనుక కూడా కమీషన్ల దందానే ఉందని ఆరోపించారు. మాకు ధైర్యం ఉందని, ఎలాంటి భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే వాటిని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. హరీశ్‌రావు ఉచిత సలహాలు ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు.

కేటీఆర్‌ను ఇరికించేందుకు హరీశ్ యత్నం : ఉత్తమ్

సీతారామ ప్రాజెక్టు 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని హరీశ్‌రావు చెప్పడం హస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. సీడబ్ల్యూసీ అనుమతులు మేమే తీసుకువచ్చామని చెబుతున్నారని, కానీ తుది అనుమతులు రాలేదని వెల్లడించారు. కేటీఆర్‌ను ఇరికించేందుకే హరీశ్‌రావు.. కాంగ్రెస్ మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకుంటున్నారని పదేపదే గుర్తు చేస్తున్నారని సెటైర్ వేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు తీసుకువచ్చే ప్రాజెక్టును గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిందని గుర్తుచేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని నెలలకే హైదరాబాద్‌కు వచ్చిన నీళ్లను కేటీఆర్ నెత్తిన చల్లుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన నీళ్లను కేటీఆర్ చల్లుకున్నారని ప్రజలకు గుర్తుచేయడానికే హరీశ్‌రావు ఇలా మాట్లాడుతున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

Next Story