Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-11-13 10:07:56.0  )
Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఎలాంటి పైరవీలు అక్కర్లేకుండానే పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) ఇవ్వబోతున్నామన్నారు. బుధవారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..ధరణిని (Dharani) అడ్డం పెట్టుకుని గత పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, అనేక ప్రభుత్వ స్థలాలను గత పాలకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వాటన్నింటిని తిరిగి రికవరీ చేసి పేదలకు అందజేస్తామన్నారు. ధరణి అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు. దేశానికి రోల్ మోడల్ గా ఆర్వోఆర్ చట్టం ఉండబోతున్నదన్నారు. ఈ కొత్త చట్టంపై అసెంబ్లీలో వివరాలు వెల్లడిస్తామని, ప్రతిపక్ష నేతలు సలహాలు కూడా కొత్త చట్టంలో తీసుకుంటామన్నారు.

డిసెంబర్ నాటికి రుణమాఫీ:

కేవలం 27 రోజుల్లో రూ. 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని ఇంకా 13 వేల కోట్ల రుణమాఫీ (Loan Waiver) చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలాంటి తొండి ఆట ఆడేది లేదన్నారు. ఈ డిసెంబర్ లోపే అర్హులైన రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయబోతున్నామన్నారు. త్వరలోనే రైతుభరోసా (Rythu Bharosa) కూడా వేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అని ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. ప్రతిపక్షం ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా ప్రజలు ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ఇవాళ ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ చార్జి మంత్రులతో మాట్లాడారరని చెప్పారు. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొంటుందని ప్రతిపక్షాలు ధర్నాలు, నిరహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగితే వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. సన్న ధాన్యం కు 500 బోనస్ ఇస్తామన్నారు. అధికారంలో ఉండగా రైతులను జైల్లో పెట్టిన బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోకి రాగానే పచ్చ కండువాలతో రైతుల వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

కలెక్టర్ పై దాడి నిందితులను మీడియా ముందు పెడతాం:

వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి ఘటనపై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని గుర్తించి అతి త్వరలోనే దోషులను మీడియా ముందు పెడుతామన్నారు. రైతుల ముసుగులో పింక్ కలర్ ముసుగు వేసుకొని కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులు, ప్రభుత్వంపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల అనే ముసుగు వెనక ఎవరు ఉన్నారో బయటపెడుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed