జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-10 15:24:23.0  )
జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలపై రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరూ పార్టీ కంటే మేమే గొప్ప అన్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో సోమవారం మీడియాతో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తుల కంటే పార్టీనే గొప్ప అని బీఆర్ఎస్ భావిస్తుందన్నారు. వాళ్ళ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌కు బీఆర్ఎస్ లొంగదని స్పష్టం చేశారు. వారు కోరుకున్నది జరగడంలేదని... వారు ఆశించిన పదవులు రాలేదని వ్యక్తిగత ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ పైనే విమర్శలు చేసే స్థాయికి వచ్చారని మండిపడ్డారు. అన్ని అలోచించిన తర్వాతే పొంగులేటి, జూపల్లి‌పై కేసీఆర్ వేటు వేశారన్నారు. అనుకున్న లక్ష్యం కోసం కేసీఆర్ గతంలో తనను విమర్శించిన వారికి సైతం అనేక అవకాశాలు కల్పించారన్నారు. పార్టీలో వున్న వారిని పోగొట్టుకోవాలని ఎవరు భావించరని తెలిపారు. జూపల్లి 2012 లో బీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. జూపల్లి కృష్ణారావుకు నైతికత లేదన్నారు. నాడు కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లో చేరితే జూపల్లిని కేసీఆర్ మంత్రిని చేశారని తెలిపారు.

పార్టీలో జూపల్లి అన్ని పదవులు అనుభవించి నేడు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత స్వార్థం కోసమే జూపల్లి కేసీఆర్‌పై విమర్శలు చేశారన్నారు. జూపల్లి మాట్లాడేదానిలో అర్ధం లేదన్నారు. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరకపోతే జూపల్లి ఎందుకు మంత్రిగా పని చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలను పొగుడుతూ జూపల్లి మాట్లాడలేదా అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పని చేసిన జూపల్లి నీళ్లు తీసుకురాకుండా ఏం చేశారన్నారు. పొంగులేటి, జూపల్లి ఎవరి ట్రాప్‌లో పడ్డారో అందరికి తెలుసన్నారు.

వచ్చే ఎన్నికల్లో అందరి బండారం బయటపడుతుందన్నారు. కేసీఆర్‌ను విమర్శించి బయటకు వెళ్లిన వారు... ఎవరు రాజకీయాల్లో నిలబడలేదన్నారు. పొంగులేటి, జూపల్లి వెళ్లినా బీఆర్ఎస్ బలహీనపడదన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రస్థానానికి పొంగులేటికి సంబంధం లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపల్లి మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని అనలేదా అన్నారు. తెలంగాణలో జూపల్లి మంత్రి అయిన తర్వాత సైతం తన ఇంట్లో వైఎస్ ఫోటో పెట్టుకున్నారన్నారు. జూపల్లి మంత్రిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే కేసులు పెట్టించి.. వైఎస్ విగ్రహాలు పెట్టించారని ఆరోపించారు.

ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ పార్టీలు పెట్టిన వారి మాటలను పొంగులేటి, జూపల్లి మాట్లాడుతున్నారన్నారు. నాలుగున్నర లక్షల కోట్లను ఒక్క వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు వున్నాయా జూపల్లి, పొంగులేటి సమాధానం చెప్పాలన్నారు. నాడు వైఎస్ హయాంలో తెలంగాణకు నీళ్లు వచ్చాయా అన్నారు. ఈ విషయంలో జూపల్లి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ వచ్చాక పాలమూరుకు నీళ్లు వచ్చాయని నాడు జూపల్లి చెప్పలేదా అన్నారు. జూపల్లి, పొంగులేటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. జూపల్లి కొల్లాపూర్‌లో ఓడిపోతే కేసీఆర్ తప్పు ఎలా అవుతుందన్నారు. జూపల్లిది రాజకీయ దిగజారుడుతనం కాదా అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్ వారిపై నిర్ణయం సస్పెన్షన్ వేటు వేశారన్నారు.

Also Read..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Advertisement

Next Story