ధరణి పోర్టల్‌పై KTR కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా కామెంట్స్..?

by Satheesh |   ( Updated:2023-11-24 15:20:59.0  )
ధరణి పోర్టల్‌పై KTR కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా కామెంట్స్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో సమస్యలు వాస్తవమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నారు. ధరణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. చిన్నచిన్న చిక్కులు చికాలు ఉన్నాయన్నారు. బాలారిష్టాలు అన్నింట్లో ఉంటాయని, ధరిణిలోనూ ఉన్నాయన్నారు. ఎక్స్‌ఫర్డ్ కన్సల్టెంట్ కమిటీ వేసి నూరుశాతం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, వ్యాపార వర్గాల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇన్నోవేషన్‌లో సృజనాత్మకతతో ఆలోచించేటప్పుడు చిన్నచిన్న సమస్యలు వస్తాయన్నారు. ధరిణి అనేది రిఫార్మ్ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరగాలంటే లంచం ఇవ్వకుండా చేసే పరిస్థితి ఉండేది కాదన్నారు. అందుకే పారదర్శకత కోసమే ధరణిని తీసుకొచ్చామన్నారు.

ధరణితో ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసుకోవడానికన్నారు. రిజిస్ట్రేషన్‌లో 8 లేయర్స్ వ్యవస్థను రద్దు చేశామని, ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని ప్రజల వేలిముద్రకు మాత్రమే ఇచ్చామన్నారు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగుల బెట్టుకోం కదా అన్నారు. మొత్తం కూల్చివేయాలంటే సాధ్యం కాదు.. లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ‘మీరు హాలిడేలో ఎంజాయ్ చేయాలంటే మాకు హాలిడే ఇవ్వకండి.. మీ పర్సనల్ హాలిడేలు అలాగే ఉండాలి.. మీకు ఇండస్ట్రీ అట్లే భూం కావాలంటే మాకు హాలిడే ఇవ్వకండి.. మళ్లీ తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి.. ఎంకరేజ్ చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. మరోసారి అధికారమివ్వండి.. పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. వ్యాపారుల కోసం ఒకే రోజు 6 జీవోలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.

మాది 6.5 ఏళ్లు.. కాంగ్రెస్ వారిది 65 ఏళ్ల పాలన అయినప్పటికీ.. ఈ తక్కువ సమయంలో ప్రజల కనీస అవసరాలు అన్ని తీర్చగలిగామన్నారు. రైతులకు విద్యుత్తు, నీళ్లు వంటివి సమగ్రంగా అందించామన్నారు. సమగ్ర, సమీకృత, సమతుల్యత కలిగిన వృద్ధి తెలంగాణ మోడల్ అన్నారు. 25 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అని పేర్కొన్నారు. చంద్రబాబు ఐటీ వృద్ధికి పాటు పడితే, రాజశేఖర్ రెడ్డి పేదల కోసం చేశారని, కానీ కేసీఆర్ పాలనలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేశారన్నారు. ప్రతి పక్షాలకు మమ్మల్ని తిట్టేందుకు ప్రజా సమస్యలు లేవు అని, అందుకే మాకు అహంకారం అని తిడుతున్నారన్నారు.

ప్రజలకు సంబంధం లేని అంశాలను చూపి తిడుతున్నారని మండిపడ్డారు. మాకుంది అహంకారం కాదు.. తెలంగాణ కోసం చచ్చేంత మమకారం అని స్పష్టం చేశారు. డిసెంబర్ 3న మేమే విజయం సాధిస్తామని, సోషల్ మీడియాలో ప్రచారం తప్ప ప్రజల్లో ఉంది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రెన్యువబుల్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నామని, ఎలక్ట్రిక్ వెహికల్ షూటల్ సర్వీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించవచ్చు అన్నారు. గ్రీన్ బిల్డింగ్స్‌కి ప్రాధాన్యత ఇస్తామని, 977 అర్బన్ పార్క్‌లు ఏర్పాటు చేశామని, వాటిని ఇంకా పెంచుతామన్నారు. హైదరాబాద్‌ని ఒలింపిక్స్ కోసం సిద్ధం చేయాలనేది మా కల అని, 2047కి హైదరాబాద్‌ని వరల్డ్ క్లాస్ నగరంగా చూడాలి అనుకుంటున్నామన్నారు.

నిరుద్యోగులంటే కాంగ్రెస్ నేతలు మాత్రమే..

నిరుద్యోగం కాంగ్రెస్‌లో పెరిగిందని.. నిజంగా నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ నేతలు మాత్రమేనని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. పదవుల కోసం రాజకీయ నిరుద్యోగులు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు. తెలంగాణలో లక్షా 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇంతకన్న ఎక్కువ ఉద్యోగాల కల్పన చేసిన ఒక్క రాష్ట్రాన్ని అయినా రాహుల్ గాంధీ చూపగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1025 గురుకులాలు ఏర్పాటు చేసి.. ఒక్కో విద్యార్థిపై లక్షా 20వేలు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆటో యూనియన్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏనాడైనా పోటీ పరీక్షలు రాశారా? ఉద్యోగాలు చేశారా? అని ప్రశ్నించారు.

వారికి నిరుద్యోగ సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా?.. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించండి అని సూచించారు. రైతులకు ఒక్క పైసా ఇవ్వని పార్టీలు ఇప్పుడు నీతులు చెప్తున్నాయని మండిపడ్డారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అంటూ ఒక్క ఇంటికి ఒక సీటే అని కాంగ్రెస్ నేతలు రాసుకున్నారన్నారు. దానికే విలువలేకుండా ఇంటికి ఇద్దరు పోటీ చేస్తున్నారన్నారు. అలాంటప్పుడు ఆపార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు విలువ ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి పరుడు అంటున్న రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా..? నోట్ల కట్టలతో దొరికిన చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

Also Read..

ధరణి పోర్టల్ కాదు . . . అది కేసీఆర్ పోర్టల్


Advertisement

Next Story