గత పదేళ్లలో జరిగినంత అవినీతి ఎప్పుడు జరగలేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by srinivas |   ( Updated:2024-01-18 16:47:58.0  )
గత పదేళ్లలో జరిగినంత అవినీతి ఎప్పుడు జరగలేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ ,తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్టం నుండి లెక్కపెడితే తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక గత పదేండ్లలో జరిగినంత అవినీతి ఎప్పుడు జరగలేదని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణమండపంలో జరిగిన “తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్” 2024 డైరి ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన గతప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి నెల కూడా గడవక ముందే బీఆర్ఎస్ నాయకులు అవాకులు,చవాకులు పేలుతున్నారని ఆయన ఆక్షేపించారు. 11 వందల మంది విద్యార్ధులు, ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం ఆనాడు తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసినట్టు మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు . త్యాగధనులపై ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 5 లక్షలకు మించిన పనులకు తప్పకుండా టెండర్లు పిలవాలనే నియమం ఉన్నప్పటికి గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పనులు అప్పగించి దోపిడి చేసిందని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో ప్రజల నెత్తిన ఆరున్నర లక్షల కోట్ల అప్పులు పెట్టిన బీఆర్ఎస్ నాయకులు.. వారు మాత్రం లక్షన్నర కోట్ల అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై తమ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో ఇరవై యేండ్లు కాపాడుకుందామని ఆయన యూనియన్ నాయకులను కోరారు. రాబోయే కొద్ది రోజుల్లో ఉద్యోగుల సమస్యలన్నింటిని తీర్చుతామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story