Jupally Krishna Rao: కేసీఆర్ పుణ్యమా అని మేమూ ఆ పని చేయాల్సి వస్తోంది.. మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-09-27 08:14:03.0  )
Jupally Krishna Rao: కేసీఆర్ పుణ్యమా అని మేమూ ఆ పని చేయాల్సి వస్తోంది.. మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన తలచుకుంటే అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఏ ఆకాంక్షల కోసం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ కలలు గత ప్రభుత్వంలో నెరవేరలేదన్నారు. శుక్రవారం రవీంద్ర భారతిలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మలతో పాటు జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఉద్యమంలో యువకులు పిట్టల్లా రాలిపోతుంటే కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకుని తన మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ధర్మకర్తలా ఉండాల్సిన గత ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం నా కుటుంబం, నా రాజ్యం అనేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరిని పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వివిధ పద్దతుల్లో లూటీ చేసిందని ఆరోపించారు. రైతు బంధు డబ్బుల కోసం అక్షయపాత్రలాంటి రింగ్ రోడ్డును అప్పనంగా అమ్మేసిన గత ప్రభుత్వం తాము గొప్ప పనులు చేశామని చెప్పుకుంటోందని దుయ్యబట్టారు.

కేసీఆర్ పుణ్యమా అని మేము అప్పులు చేయాల్సి వస్తోంది..

కేసీఆర్ పరిపాలన అంతా బాధ్యత రాహిత్యంతో మేడిపండు చందంగా సాగిందని జూపల్లి మండిపడ్డారు. తాము వచ్చాక ఐఐహెచ్ టీకి కొండా లక్ష్మణ్ బాపు పేరు పెట్టుకున్నామని, రైతున్నలతో పాటు నేతన్నల రుణమాఫీ ప్రకటించామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన పుణ్యమా అని ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. దీనికోసం అప్పులు చేస్తుంటే ఎందుకు అప్పులు చేస్తున్నారంటూ మమ్మల్నే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. మా ప్రభుత్వం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు కట్టేందుకే కదా అన్నారు.

బాపూజీ మహా పురుషుడు:

బడుగు బలహీన ప్రజలు, నేతలన్న కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసిన మహా పురుషుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జూపల్లి కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన విధానాన్ని మనందరం అలవరుచుకోవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. తొలి దశ తెలంగాణ ఉద్యంలో మంత్రి పదవిని త్యాగం చేయడమే కాకుండా రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని శపథం చేసిన మహానుభావుడని కొనియాడారు. మలిదశ ఉద్యమంలో చల్లని చలిలో కూడా ఢిల్లీలో దీక్ష చేపట్టిన ధీశాలి అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ఇంటిని త్యాగం చేసిన వ్యక్తి అని అలాంటి ఆయన స్వరాష్ట్రాన్ని చూడకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరం అన్నారు. పొ.జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూతో పాటు వందలాది మంది వ్యక్తులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసి అమరవీరులుగా నిలిచారన్నారు. తెలంగాణ రావడానికి బాపూజీ, అమరవీరుల త్యాగ ఫలితం ఓ కారణం అయితే పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మరో కారణం అన్నారు. మన జీవన విధానం ధ్వంసం అవడం వల్లే అనేక అనర్థాలకు కారణమన్న మంత్రి.. ఈ జీవన విధానం ధ్వంసం కాకుండా ఉండాలంటే బాపూజీ అనుసరించిన జీవన విధానం యావత్ సమాజానికి ఆదర్శం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed