‘పాలిచ్చే బర్రె ఏదో.. దున్నపోతు ఏదో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు’

by GSrikanth |   ( Updated:2024-02-13 14:40:51.0  )
‘పాలిచ్చే బర్రె ఏదో.. దున్నపోతు ఏదో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో డ‌బుల్ స్పీడ్‌తో అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ ప‌గ‌టి క‌లలు కంటున్నారని, ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అధికారం క‌లేనని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ ప్రజా తీర్పును అవ‌మానిస్తున్నారన్నారు. పాలిచ్చే బర్రె ఏదో.. దున్నపోతు ఏదో తెలంగాణ ప్రజ‌ల‌కు బాగా తెలుసు అన్నారు. అందుకే బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజ‌లు చ‌ర‌మ‌గీతం పాడారన్నారు. గ‌త తొమ్మిదిన్నర ఏళ్లు ప్రజ‌ల ప‌క్షాన కాంగ్రెస్ పోరాడటంతోనే పార్టీకి ప‌ట్టం క‌ట్టారన్నారు. ప్రజ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేసీఆర్ న‌ల్గొండ స‌భ‌ అని దుయ్యబట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడ‌ అవీనితి బ‌య‌ట‌ప‌డుతుందోననే భ‌యంతోనే కేసీఆర్ డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌ల‌పై కేసీఆర్‌ది స‌వ‌తి తల్లి ప్రేమ‌ అన్నారు. పక్కనే కృష్ణా ఉన్నా.. ఫలితం లేకపాయే అనే పాట రాసిన అని చెప్పుతున్న కేసీఆర్.. కృష్ణా పరిహాక ప్రాంత ప్రజ‌ల‌కు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, డిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. జ‌గ‌న్‌తో కుమ్మక్కై కృష్ణా బేసిన్ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సంపదను దోచుకొని అభివృద్ధిని మరిచారని విమర్శించారు. బీఆర్ఎస్ నేత‌లు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు, పాప పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ఎండగడుతామన్నారు.

కాళేశ్వరం, మేడిగ‌డ్డ, ఇత‌ర సాగునీటి ప్రాజెక్ట్‌ల‌తో పాటు మిష‌న్ భ‌గీర‌థ‌, చీక‌టి క‌రెంట్ ఒప్పందాలు, భూదందాలు అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం బ‌య‌ట‌పెడ్తదన్నారు. క‌మీష‌న్ల కోస‌మే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారని, బీఆర్ఎస్ పాలన డొంక కదిలితే కొన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము బయటకువస్తదన్నారు. మేడిగడ్డ ప‌రిశీల‌న‌లో నాణ‌త్య డొల్లత‌నం బ‌య‌ట‌ప‌డిందన్నారు. నాణ్యత‌ను గాలికి వ‌దిలేసి హ‌డావుడిగా ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేశారని, దీంతో వేల కోట్ల రూపాయల ప్రజ సొమ్మును నీటి పాలు చేశారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed