నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు సవాల్!

by Nagaya |   ( Updated:2022-09-02 10:19:57.0  )
నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు సవాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది పైసలు ఇచ్చి పదింతల ప్రచారం చేసుకుంటోందని మంత్రి హారీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆయూష్మాన్ భారత్‌లో చేరలేదంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఒక వేళ ఇప్పటికే తెలంగాణ ఈ స్కీమ్‌లో చేరి ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు శుక్రవారం రియాక్ట్ అయ్యారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో అమలు అవుతోందని, ఎంతకైనా మంచిదనే ఉద్దేశంతోనే 2021 లోనే తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరిందన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద రూ.505 కోట్లు ఖర్చు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇటీవల ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం వాటా రూ.43 కోట్లు కేటాయించిందని చెప్పారు.

ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ పట్టపగలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిర్మలా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయిందని అబద్దాలు చెప్పడంలో బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారని బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారేలా మాట్లాడవద్దని హితవు పలికారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయన్నారు. ఫొటోలు పెట్టాల్సి వస్తే కేంద్రంలో ముందుగా సీఎం కేసీఆర్ ఫొటో పెట్టాలన్నారు. బీజేపీ నోరు విప్పితే అన్ని అబద్దాలేన్నారు. ఇవాళ కేంద్ర మంత్రుల తీరు పార్లమెంట్‌లో ఒకలా బీజేపీ సమావేశాల్లో మరొకలా ఉంటున్నాయని, ఇది మంచిది కాదన్నారు.

అబద్దాలు, అర్థసత్యాలతో నిజాలు దాచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అబద్దాల మంత్రుల జాబితాలో అమిత్ షా, గడ్కరీతో పాటు నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారని నిప్పులు చెరిగారు. తెలంగాణ అప్పులు పెరిగిపోయానని నిర్మలా అబద్దాలు చెబుతోందన్నారు. 2014 లో వరల్డ్ హంగర్ ఇండెక్స్‌లో 55వ స్థానంలో ఉన్న భారత్‌ను 101వ స్థానానికి దిగజార్చిన ఘనత బీజేపీది కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా పేదరికంలో చేరిపోయామని, 4 శాతం ఉన్న నిరుద్యోగ రేటు బీజేపీ హయాంలో 11 శాతానికి పెరిగిందని విమర్శించారు. ఒక మహిళగా నిర్మలా సీతారామన్ దేశ మహిళల కళ్లలో కన్నీరు పెట్టించిన ఘనత బీజేపీ దేనని ఎద్దేవా చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటిందన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ వీటిపై ఎందుకో మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గతంలో వ్యవసాయశాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని, కానీ ఆర్థిక శాఖ మంత్రి కామారెడ్డిలో మాత్రం పెరిగాయని చెబుతున్నారని ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. భారత దేశ చరిత్రలో ఇంత దారుణంగా ఎప్పుడూ రూపాయి విలువ పతనం కాలేదని విమర్శించారు. దేశ తలసరి ఆదాయంలో ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం 144కి పడిపోయిందని, అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరుకుంటే పౌరుల ఆదాయం పడిపోయిందని మండిపడ్డారు. దేశ సగటు కంటే తెలంగాణ సగటు అన్ని రంగాల్లో ముందుందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2 ,78, 823 గా ఉందని ఇది కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చెప్పిన లెక్కలేనన్నారు. అబద్దాలు చెబుతున్న బీజేపీ నేతల నోళ్లకు మొక్కాలని ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను అప్పులు చేసి పూర్తి చేసుకున్నామని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావడం వల్లే ఇవాళ తెలంగాణలో వరి ధాన్యం పుష్కలంగా పండిందని అన్నారు.

కేంద్రమే తెలంగాణ స్కీమ్‌లను కాపీ కొడుతోంది

కేంద్ర పథకాల పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ అంటున్నారని ఇంత పచ్చి అబద్దం మరొకటి లేదన్నారు. రైతుబంధు స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో చెప్పాలన్నారు. ఈ స్కీమ్‌ను కేంద్రం కాపీ కొట్టిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకం ఇతర ఏ రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలన్నారు. స్కీమ్ లలో పేర్లు ఎక్కడ మార్చామో చెప్పాలన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న నిర్మల సీతారామన్ రైతులను అడిగి తెలుసుకోవాలన్నారు. మంచిని మంచి అంటే ఎవరైనా హర్షిస్తారని కానీ జరగనిది జరిగినట్లు చెబితే ఎవరూ హర్షించని అన్నారు.

కేంద్రమే రైతుబంధును, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మిని ఇప్పుడిప్పుడే కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటనను స్వాగతిస్తున్నామని ప్రజలతో కలిసి మాట్లాడాలని సూచించారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధ సత్యాలు, అసత్యాలు బీజేపీ వాళ్లవి అయితే అక్షర సత్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వానివన్నారు.

Also Read: 'కాళేశ్వరం ఘనత ఢిల్లీ నాయకులకు కనబడుతలేదా.. వినబడుతలేదా..'

Advertisement

Next Story