కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ.. మంత్రికి కీలక సూచన చేసిన సీఎం..!

by Satheesh |   ( Updated:2023-10-08 15:30:05.0  )
కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ.. మంత్రికి కీలక సూచన చేసిన సీఎం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీష్ రావు ప్రగతిభవన్‌లో ఆదివారం భేటీ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభోత్సవం ఉన్నప్పటికీ కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హరీష్ రావు రద్దు చేసుకొని వెళ్లారు. వైరల్ ఫివర్‌తో కేసీఆర్ గత 20 రోజులుగా ఎవరిని కలువలేదు. ఒక్కసారిగా హరీష్ రావుతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. గత మూడువారాలుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించడం, బీజేపీ సైతం మేనిఫెస్టోపై కసరత్తు చేస్తుండటంతో అందుకు భిన్నంగా, ప్రజలను ఆకట్టుకునేలా బీఆర్ఎస్ సైతం మేనిఫెస్టోపై రూపకల్పన చేస్తుంది.

ఆ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలి.. చేర్పులు మార్పులపై సైతం చర్చించినట్లు సమాచారం. మహిళలు, రైతులందరికీ పింఛన్, గ్యాస్ సబ్సిడీ, ఉద్యోగ క్యాలెండర్ తదితర అంశాలు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉండాలని, ఈ అంశాలను పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ ఆరుగ్యారెంటీలు వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతాయి.. ప్రజల్లోకి ఏమేరకు వెళ్లాయి అనే అంశంపై సైతం చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 16న వరంగల్ సభపై కూడా చర్చించినట్లు సమాచారం. పండుగల సమయంలో జనసమీకరణ, తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలపైనా చర్చించారు. సమావేశాలకు జనం ఎలా వస్తున్నారు?.. ప్రభుత్వ పథకాలపై ఎలాంటి స్పందన ఉందనేదానిపైనా కేసీఆర్ వివరాలు సేకరించారు. సమావేశాలకు జనం ఆశించినంత రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎక్కడ లోపం జరుగుతుంది.. ప్రతిపక్షాలపై విమర్శలు, ఎదురుదాడి చేయకపోవడం వల్లనే ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నామని ఇంకా స్పీడ్ పెంచాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా విమర్శలకు పదును పెట్టాలని పార్టీనేతలకు చెప్పాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఆరెండు ప్రధానపార్టీల్లో టికెట్ ఆశించినప్పటికీ రాదనే నిరాశలో ఉన్నవారిని బీఆర్ఎస్ లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. జ్వరంతో ఈ భేటీలో మంత్రి కేటీఆర్ పాల్గొనలేదు. అయితే సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి కార్యాలయం పేర్కొంది.

Advertisement

Next Story