Rajasingh: బీఆర్ఎస్ సపోర్టుతో ఎంఐఎం చెరువు కబ్జా..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-08-27 15:41:44.0  )
Rajasingh: బీఆర్ఎస్ సపోర్టుతో ఎంఐఎం చెరువు కబ్జా..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ సపోర్టుతో ఎంఐఎం పార్టీ వాళ్లు చెరువు కబ్జా చేసి ఫాతిమా కాలేజీ నిర్మించారని, అలాగే ప్రభుత్వ భూమిలో అసదుద్దీన్ ఓవైసీ పెద్ద బంగ్లా కట్టాడని, వీటన్నింటిపై బుల్డోజర్లు నడిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. హైడ్రా నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డికి దన్యవాదాలు తెలిపిన ఆయన ఎంఐఎం పార్టీ కబ్జాలపై విచారణ చేపట్టాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం కి గులాంగా ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల సపోర్టుతో 30 ఎకరాల చెరువులో 12 ఎకరాల భూమి కబ్జా చేసి ఎంఐఎం ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యూకేషన్ కాలేజీ నిర్మాణం చేశారని ఆరోపించారు.

ఫ్రీ ఎడ్యూకేషన్ పేరుతో కోట్లు సంపాదిస్తుండటంతో ఆ వర్గం వారే దానిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చెరువుల కబ్జాపై మంచి నిర్ణయం తీసుకున్నారని, దానికి ముఖ్యమంత్రికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ.. కాలేజీని డిమాలిష్ చేస్తే 40 వేల మంది యువకులు ఉన్నారని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మంచి సంకల్పం తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్నోళ్లు వార్నింగ్ లు ఇస్తూనే ఉంటారని, వాటన్నింటినీ పక్కన పెట్టి మీ సంకల్పం పూర్తి చేయాలని సూచించారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడితే జైల్లో వేశారని, ఆ సమయంలో ఆయనకు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. ఎంఐఎం వాళ్లు చెరువులను కబ్జా చేశారని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని డిమాలిష్ చేయాలని బీజేపీ తరుఫున తాము కోరుతున్నామన్నారు. అలాగే హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయని, తన నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ని కబ్జా చేశారని, దీనికి హైదరాబాద్ కలెక్టర్ సపోర్టుగా ఉన్నారని తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఎంఐఎం వాళ్లు చేసిన కబ్జాలను విడిచిపెట్టొద్దని, అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వ భూమిలో పెద్ద బంగ్లా కట్టాడని, దానిపై కూడా విచారణ జరిపి, బుల్డోజర్లతో కూల్చాలని కోరుతున్నామని రాజాసింగ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed