నిజాంపేట్ అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..?

by Kalyani |   ( Updated:2023-05-20 16:32:03.0  )
నిజాంపేట్ అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..?
X

దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ లో జరుగుతున్న అక్రమాలపై, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరిపినట్లు సమాచారం. ‘దిశ’ పత్రిక నిజాంపేట్ లో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతం, అక్రమ 59 జీవో దరఖాస్తులపై వరుస కథనాలు ప్రచురిస్తుంది. వాటి వెనుక మేయర్ భర్త షాడో మేయర్ గా అవతరించి అక్రమాలకు చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు నిత్యం వస్తున్నాయి. నిజాంపేట్ లోని పలు ప్రభుత్వ సర్వే నెంబర్స్ లోని ప్రభుత్వ స్థలాలను కొల్ల గొట్టేందుకు షాడో మేయర్ పథకం రచించినట్లు ప్రతిపక్ష పార్టీలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. సుమారు రూ.2 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూ కబ్జాకు షాడో మేయర్ ఆధ్వర్యంలో రూపకల్పన జరిగినట్లు, పోర్జరి పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేసేందుకు పూనుకున్నట్లు వినికిడి.

అదే దారిలో నిజాంపేట్ సర్వే నెంబర్స్ 332 లోని 500 చదరపు గజాల ప్రభుత్వ స్థలం, 233/15,16 లోని సుమారు 1000 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేయించి 59 జీవో కింద దరఖాస్తు చేసిన విషయాన్ని దిశ వెలుగు లోకి తీసుకువచ్చింది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు దిశ కథనంపై స్పందించి 332,233/15,16 లో జరిగిన కబ్జాపై విచారణ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కబ్జాలపై బాచుపల్లి తహశీల్దార్ సురేందర్ ను ఇంటెలిజెన్స్ అధికారులు, విలేకరులు సంప్రదించగా వాస్తవాలు దాచుతూ సరైన సమాధానం చెప్పకుండా దాట వేసినట్లు సమాచారం. ఈ కబ్జాల వెనుక బాచుపల్లి తహసీల్దార్ పాత్ర ఎంత వరకూ ఉందనే అంశాన్ని విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు విస నీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed