మెట్రో రైలు ఉత్తరాన విస్తరణపై సర్కార్ నిర్లక్ష్యం

by Sridhar Babu |
మెట్రో రైలు ఉత్తరాన విస్తరణపై సర్కార్ నిర్లక్ష్యం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మెట్రో రైలును హైదరాబాద్ ఉత్తర దిశగా విస్తరించాలని బీజేపీ మేడ్చల్ - మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా ఇన్ చార్జి అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి అన్నారు. గురువారం తూంకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ రెండో దశ మెట్రో విస్తరణలో నగరానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రెండో విడతలో పార్ట్ ఏ, పార్ట్ బీలుగా మెట్రో రైలు 6 కారిడార్లను రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలను సిద్దం చేసిందన్నారు. అయితే ఆయా కారిడార్లకు తాము వ్యతిరేకం కాదని, ఉత్తర ప్రాంతాన్ని విస్మరించడంపై మాత్రమే తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అధిక ప్రాంతం ఉత్తర దిశగా విస్తరించిందన్నారు.

రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలు జీవనోపాధి కోసం వచ్చి ఉత్తర ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. నార్త్ లో విద్యాసంస్థలు, పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. నిత్యం వేలాది కుటుంబాలు నార్త్ తెలంగాణ నుంచి రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. దీంతో మెట్రోను నార్త్ ప్రాంతంలో బాలా నగర్ నుంచి షాపూర్ నగర్​, సూరరం మీదుగా గండి మైసమ్మ వరకు, అదే విధంగా జూబ్లీ బస్టాండ్ నుంచి బోయిన్ పల్లి నుంచి సుచిత్ర, కోంపల్లి మీదుగా మేడ్చల్ వరకు, జూబ్లీ బస్టాండ్ నుంచి అల్వాల్ నుంచి తూంకుంట వరకు, తార్నక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు మీదుగా నాగారం, కీసర వరకు, ఉప్పల్ నారాపల్లి, ఘట్ కేసర్ మీదుగా యాదగిరి గుట్ట వరకు మెట్రోను విస్తరించాలని మల్లారెడ్డి సూచించారు. సమావేశంలో జిల్లా అర్బన్, రూరల్ ప్రధాన కార్యదర్శులు డి.విఘ్నేశ్వర్, డి.గిరివర్దన్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు ఈశ్వర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story