పర్మీషన్లు నిల్.. స్కూళ్లు ఫుల్!

by Shiva |
పర్మీషన్లు నిల్.. స్కూళ్లు ఫుల్!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: పాఠశాలలు ఫుల్.. అనుమతులు నిల్ అన్న చందంగా ఉంది మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని పాఠశాలల పరిస్థితి. ప్లే స్కూల్ మొదలు ఇంటర్నేషనల్ స్కూళ్ల వరకు చాలా వాటికి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. సిబ్బంది లేరనే సాకుతో అధికారులు చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పలు పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారు. సిబ్బంది కొరత పేరుతో అనుమతులు లేని పాఠశాలలకు కనీసం నోటీసులు ఇవ్వలేకపోతున్నారంటే జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ స్థాయిలో అక్రమ పాఠశాలల నిర్వాహకులకు సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సిబ్బంది లేని పక్షంలో అనుమతులు లేకుండా నేర్పిస్తున్న పాఠశాలకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా నోటీసులు పంపించే అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా చేయకపోవడంపై వారి సిన్సియారిటీ ఏ పార్టీతో ఇట్టే అర్థమవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఈ మధ్యకాలంలో పలు పాఠశాలలపై వచ్చిన ఫిర్యాదులను కొన్ని..

పేరుకే ఇంటర్నేషనల్ స్కూల్..

కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ కాలనీలో సీబీఎస్ఈ సిలబస్‌తో వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు సీబీఎస్సీ అనుమతులు లేవు. ఏప్రిల్ రెండో వారంలో ‘వ్యాక్సన్ స్కూల్’ పేరుతో మాత్రమే వీరు జిల్లా విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు నుంచి మీరు అడ్మీషన్లు తీసుకోవడం, తరగతి గదులను ప్రారంభించడం జరిగిపోయాయి. ఇదంతా అప్పటి కుత్బుల్లాపూర్ ఎంఈఓ ఆంజనేయులుకు తెలిసినా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నేటి వరకు ఈ పాఠశాలకు సీబీఎస్సీ అనుమతులు లేవు.

అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య..

కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్డు మూడుగుళ్ల ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు కనీస అనుమతులు లేకుండానే అడ్మీషన్లు తీసుకోవడం, తొలుత ఆన్లైన్ తరగతులు నిర్వహించడం, అనంతరం ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించడం చేసింది. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో పాటుగా కొందరు కోర్టును ఆశ్రయించడంతో చేసేదిలేక జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ఎంఈఓ వసంతకుమారి పలు సందర్భాల్లో పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. ఓ సందర్భంలో ఎంఈఓ వసంత కుమారిని అడ్డుకోవడంతో ఆమె ఈ విషయంపై పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీ చైతన్య పాఠశాల పై కేసు నమోదైంది.

మల్లంపేటలో శ్రీ విద్యాధర స్కూల్

దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట శ్రీ సాయి బాలాజీ కాలనీలో శ్రీ విద్యాధర పాఠశాలకు అనుమతులు లేవంటూ జూన్ మూడో వారంలో విద్యాశాఖ మండల అధికారులు సీజ్ చేశారు. ఈ పాఠశాలను పురాతన భవనంలో ఏర్పాటు చేయడమే గాక అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్‌లో తరగతి గదులు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఫిర్యాదులు రావడంతో పాఠశాలను అధికారులు మూసివేశారు.

ఉప్పల్‌లో త్రిష్ణ మాంటిసోరి స్కూల్..

ఉప్పల్ భగయత్‌లో త్రిష్ణ మాంటిసోరి స్కూల్ ఒకవైపు తరగతి గదులు నిర్వహిస్తునే మరోవైపు పాఠశాలపై అదనపు అంతస్తుగా భారీ షెడ్ నిర్మాణం చేపట్టింది. సాధారణంగా ఇట్టి నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఉండవు. అయినప్పటికీ పాఠశాలపై అనుమతి లేని షెడ్ నిర్మాణం చేపట్టడమే గాక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో సైతం పనులు చేస్తుండటంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

సిబ్బంది కొరతతో చర్యల్లో జాప్యం: విజయకుమారి, డీఈవో

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరతతో చర్యలు తీసుకోవడంలో జాప్యం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. స్కూల్ పేరుతో అనుమతులు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో అడ్మీషన్లు వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలకు సీబీఎస్ఈ వారికి లేఖ రాస్తాం.

Advertisement

Next Story

Most Viewed