Additional Collector Vijayender : అర్హులైన వారికి రుణాలు అందించాలి..

by Sumithra |
Additional Collector Vijayender : అర్హులైన వారికి రుణాలు అందించాలి..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో బుధవారం డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేతివృత్తుల వారికి పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా అంతరించి పోతున్న హస్తకళలకు జీవం పోసినట్టు అవుతుందన్నారు. ఈ స్కీంలో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డులు జత చేసి గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని జిల్లా స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు కార్డు అందజేస్తారన్నారు. గుర్తింపు కార్డుపొందిన వారికీ అవసరమైన ఉపకరణాలు పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా మొదటి విడతగా రూ.50 వేలు రెండు, మూడు విడతల్లో లక్ష, రెండు లక్షలు అందజేస్తారు.

లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమ పనితీరును మెరుగు పరచుకోవాలన్నారు. పట్టణ ప్రాంతమైన మేడ్చల్ జిల్లాలో యువతకు ఉన్నత విద్యకై ఎక్కువ శాతం రుణాలు అందించడం ద్వారా యువత ఉన్నత విద్యా ప్రమాణాలను పొంది వారి బంగారు భవిష్యత్తు కు మైలురాయి అవుతుందన్నారు. రైతులకు పంట రుణాలు, టర్మ్ లోన్ లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ , పరిశ్రమలు, డీఆర్డీఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం, ఇతర ప్రాధాన్యత రంగాలకు అర్హులైన పేద లబ్దిదారులకు మంజూరు చేయాలని కోరారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవగాహన కలిగిస్తూ విరివిగా రుణాలు అందించాలని కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిర్ణిత గడువులోగా రుణాలు మంజూరు చేయాలనీ అన్నారు.

బ్యాంకులో దరఖాస్తులు పెండింగులో లేకుండా చూసుకోవాలని, తిరస్కరణకు గురైన వాటిని పరిశీలించి తగు రీతిలో బ్యాంకులు పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి నెలకొకసారి లేనిచో రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా బ్యాంకర్స్ బెనిఫిషరీ మీటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.. ఆర్ధిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్ లావాదేవీల పై అవగాహనా కలిగించాలని బ్యాంకర్లకు సూచించారు. రెండవ దశరైతురుణ మాఫీ పూర్తయినందున బ్యాంకర్లు పంటరుణాల పునరుద్దరణ వేగవంతం చేయాలన్నారు. అదనపపు కలెక్టరు వివిధ ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్బిఐ ఎజీఎం శ్రీలక్ష్మి శ్రావ్యా, కెనరా బ్యాంకు డీజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్, ఆర్బీఐ అధికారి పల్లవి, నాబార్డ్ డీడీఎం పి.అఖిల్, కృష్ణకాంత్ రాయ్, జీఎండీఐ సి.ప్రశాంత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజెస్, జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story