కార్నివాల్ మాయాజాలం.. తప్పుల తడకలుగా ట్రేడ్ లైసెన్సులు..!

by sudharani |
కార్నివాల్ మాయాజాలం.. తప్పుల తడకలుగా ట్రేడ్ లైసెన్సులు..!
X

దిశ, కంటోన్మెంట్ : ట్రేడ్ లైసెన్సుల జారీ మాయాజాలాన్ని తలపిస్తోంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జారి అవుతున్న ట్రేడ్ లైసెన్సులు తప్పుల తడకలుగా మారాయి. వ్యాపారం ఒక చోట నిర్వహిస్తుంటే.. ట్రేడ్ లైసెన్సులు మరో చోటు ఇస్తున్నారు. ఒకే అడ్రస్‌తో కొన్ని డబుల్ ఎంట్రీ అవుతున్నాయి. శాస్త్రీయ విధానంలో ఆన్ లైన్ చేసిన దుకాణాలను క్రమబద్దీకరించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం.. సరైన పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తప్పుల తడకలు..

కంటోన్మెంట్ బోర్డు ఆదాయ వనరుల్ని సమకూర్చుకునే మార్గాల్లో ఒకటైన ట్రేడ్ లైసెన్సుల (వ్యాపార నిర్వహణ అనుమతి) జారీ గందరగోళంగా మారుతోంది. ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి జారీ చేస్తున్న డిమాండ్ బిల్లులు తప్పుల తడకలుగా ఉంటున్నాయి. కాగా ట్రేడ్ లైసెన్సుల జారీ ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల అనుమతులు తీసుకున్న విషయం విధితమే. బోర్డు పరిధిలో ఏ చోట వ్యాపారం నిర్వహించినప్పటికీ, ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని కంటోన్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తద్వారా బోర్డుకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలని భావించింది. అయితే లైసెన్సుల జారీ ప్రక్రియ పక్కదారి పడుతోంది. వ్యాపారం ఒక చోట నిర్వహిస్తుంటే మరో చోట ట్రేడ్ లైసెన్సులను జారీ చేస్తూ.. సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్నివాల్ మాయా..

న్యూ బోయిన్ పల్లి, నందమూరినగర్ లోని బీ3 ఓల్డ్ గ్రాంట్ (181) బంగ్లాలో కార్నివాల్ పేరిట దాబా నడుస్తోంది. కంటోన్మెంట్ బోర్డుకు ట్రేడ్ లైసెన్సు కోసం కనుకుల అనమిక రెడ్డి, మౌనిక వర్దన్‌లు దరఖాస్తు చేయగా, 2022, జూలై 19న బోర్డు ట్రేడ్ లైసెన్సు జారీ చేసింది. ఈ ట్రేడ్ లైసెన్స్ 2022, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023, మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ట్రేడ్ లైసెన్స్ మూడు నెలల అనంతరం అనగా జూలైలో జారీ చేశారు. దీనికితోడు దరఖాస్తు దారు సర్వే నెంబర్ 33, రోడు నెంబర్ 7, ప్లాస్సీ లేన్, ఓల్డ్ బోయిన్ పల్లి అనే అడ్రస్‌లో జారీ చేశారు. ప్రస్తుత వ్యాపారం మాత్రం బీ 3 ఓల్డ్ గ్రాంట్ బంగ్లా నెంబర్ 181లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఏలాంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండా షెడ్ల నిర్మాణం చేపడుతున్న వ్యాపారానికి కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ట్రేడ్ లైసెన్స్ జారీ విధానాన్ని పరిశీలిస్తే.. తప్పుడు ధృవీకరణ పత్రాలతో మాయా చేసినట్లు ఇట్టే తెలిసిపోతుంది. వ్యాపార లైసెన్సులపై ఆరా తీస్తే మరిన్ని అవకతవకలు బయటపడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు అధికారులు బీ3 బంగ్లాలో సాగుతున్న అక్రమ నిర్మాణాలు, ట్రేడ్ లైసెన్స్ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed