tenders : ష్.. అంతా గోప్యం..

by Sumithra |
tenders : ష్.. అంతా గోప్యం..
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫంక్షన్ హాల్స్ టెండర్లు అవినీతి, అక్రమ మార్గాలకి పరాకాష్ట గా మారాయి. పూర్వగ్రామ పంచాయతీ హయాంలో నుంచి నామ మాత్రపు ఫీజులను మాత్రమే కార్పొరేషన్ కు చెల్లిస్తూ కొందరు పెత్తనం దారులు నిజాంపేట్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట్ గ్రామాల ఫంక్షన్ హాల్స్ ను తమ గుప్పిట్లో పెట్టుకొని నిర్వహిస్తూ వస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు జరిగాక ఈ ఫంక్షన్ హాల్స్ అద్దెలపై పలు సార్లు ఆందోళనలు, అభ్యంతరాలు జరిగాయి. ప్రజా ప్రతినిధులుగా ఉన్న కొందరు బినామీ వ్యక్తులని నిర్వాహకులుగా ఉంచి ఫంక్షన్ హాల్స్ ను తమ గుప్పిట్లో ఉంచుకుని అందిన కాడికి దోచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫంక్షన్ హాల్స్ కు ఓపెన్ టెండర్లు నిర్వహించాలనే డిమాండ్ స్థానికంగా ఎప్పటి నుండో ఉంది.

నిజాంపేట్ కార్పొరేషన్ కాలం జనవరి 2025 నాటికీ పూర్తి కావస్తుండడం, జీహెచ్ఎంసీ లో నిజాంపేట్ కార్పొరేషన్ ను కూడా కలపనున్న తరుణంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. పేరుకు మాత్రమే ఓపెన్ టెండర్లు గా చెబుతూనే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు బినామీల రూపంలో కేటాయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి పేపర్ ప్రకటన లేకుండా, ఎవ్వరికీ పౌర సమాచారం ఇవ్వకుండా గూడచార చర్యగా పబ్లిక్ డొమైన్ లో ఉంచకుండా ఇక్కడి ఫంక్షన్ హాల్స్ ను గంపగుత్తగా కొందరికే కేటాయించేందుకు అధికారులు ఉత్సాహం చూపడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిజాంపేట్ లోని బండారి లే ఔట్ కాలనీ లోగల ఫంక్షన్ హాల్, ప్రగతినగర్ లో గల రెండు ఫంక్షన్ హాల్స్, బాచుపల్లిలో మరో ఫంక్షన్ హాల్ కు మూడు సవంత్సరాలు నడిపించేందుకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు.

నిబంధనలు ప్రకారం అయితే టెండర్లు పేపర్ ప్రకటన ఇస్తూ, పబ్లిక్ డొమైన్ ఆన్లైన్ లో పెడుతూ చాలా పారదర్శకంగా నిర్వహించాలి. కానీ నిజాంపేట్ మున్సిపల్ అధికారులు అలా కాకుండా నామ మాత్రంగా టెండర్ ప్రక్రియ పేరుకు మాత్రమే నిర్వహిస్తూ ఎవ్వరికి పబ్లిసిటీ చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తీరుపై తీవ్రంగా విమర్శలు రావడంతో 27 జులై డెడ్ లైన్ గా ఉండగా ఆగస్టు 5 వరకు టెండర్లు ప్రక్రియను పెంచారు. 5 వ తేదీ సాయంత్రం 4 వరకు టెండర్ ప్రక్రియ స్వీకరణ ఉన్నప్పటికీ 4 లోపే మున్సిపల్ కార్యాలయం కు వచ్చిన దరఖాస్తు దారుల అప్లికేషన్ లు తీసుకోకుండా తిరస్కరించడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికేలా టెండర్లు గోప్యంగా నిర్వహించడం చట్ట విరుద్ధం అని వాపోయారు. ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

Advertisement

Next Story