నాడెం చెరువు తూము ధ్వంసం

by Sridhar Babu |
నాడెం చెరువు తూము ధ్వంసం
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మండల వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు తూము గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. వెంకటాపూర్ గ్రామ సర్వేనెంబర్ 813లోని బఫర్ జోన్ లో అనురాగ్ విద్యాసంస్థలు, మెడికల్ కళాశాల నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కారీడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ సమయంలో హైడ్రా వచ్చి బఫర్​ జోన్​లో నిర్మాణాలకు కూల్చివేస్తారో అని అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బఫర్ జోన్ లో నిర్మాణాల కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పలేమని కోర్టు ఉత్తర్వులు శుక్రవారం ఇచ్చింది.

అయితే నాడెం చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లో నీరు లేకుండా చేసేందుకు తూము గేట్లను శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం మత్స్యకారులు మేడం చెరువు తూము ధ్వంసమైనట్లు గుర్తించారు. జేసీబీ సాయంతో తూము గోడలను, గేటును కూల్చే ప్రయత్నం చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నిత్యం వాహన రాకపోకులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్లుగా స్థానికులు, మత్స్యకారులు చెబుతున్నారు. అయితే అనురాగ్ కళాశాల ఎదురుగానే ఈ తూము ఉండడం, కళాశాలలోని సీసీటీవీలు పని చేయట్లేదు అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావ్య, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాడెం చెరువు తూమును పరిశీలించారు. చెరువు నీరు బయటకు వెళ్లిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేష్ తెలిపారు. సంఘటనపై వెంకటాపూర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు నీరడి లింగం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ ఏఈ పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నాడెం చెరువు తూము ధ్వంసంలో తమ పాత్ర ఏమీ లేదని నాడెం చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణదారులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనురాగ్ విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed