చెరువు బఫర్ జోన్ లో స్మశాన వాటిక నిర్మాణం

by Kalyani |
చెరువు బఫర్ జోన్ లో స్మశాన వాటిక నిర్మాణం
X

దిశ,మేడ్చల్ బ్యూరో : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాసిమ్ చెరువు బఫర్ జోన్ లో స్మశాన వాటిక నిర్మాణ పనులు చేపడుతున్నారని ఇరిగేషన్ డిఈ పి. శ్రీనివాస్ పేర్కొన్నారు. చెరువు ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కీసర మండల తహసీల్దార్, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్లకు లేఖ రాశారు. చెరువు ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులకు పలువురు ఫిర్యాదు చేయడంతో నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాస్, ఏఈ ప్రశాంత్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కిషోర్ సంఘటన స్థలాన్ని సందర్శించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

ప్రస్తుతం స్మశాన వాటిక నిర్మిస్తున్న స్థలం పూర్తిగా బఫర్ జోన్ లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వుల కాపీలను దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్, కీసర తహసీల్దార్, కీసర ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు సమర్పించినట్లు నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాస్ తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువు ప్రాంగణంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్ట వద్దని సూచించారు. కీసర రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నాసిక్ చెరువులోని బఫర్ జోన్ లో చేపట్టిన స్మశాన వాటిక నిర్మాణాలను తొలగిస్తామని అన్నారు.

బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో వేసిన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చి వేస్తున్న విషయాన్ని వారు గమనించారు. చెరువు ప్రాంగణంలో నిర్మాణ వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు. ఇప్పటికే నాసిక్ చెరువులో జరుగుతున్న అక్రమ స్మశాన వాటిక నిర్మాణ పనులను నిలిపివేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించిన విషయం విధితమే. చెరువు ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

Next Story

Most Viewed