పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలి

by Sridhar Babu |
పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : విద్యార్థులకు ఇంటి దగ్గరి కంటే రెసిడెన్షియల్ పాఠశాలలోనే రక్షణ ఎక్కువగా ఉంటుందనే నమ్మకం, మెరుగైన వసతులు కల్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం మేడ్చెల్ జిల్లా కలెక్టరేట్ లో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడుతూ....రెసిడెన్షియల్ పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులను ప్రిన్సిపాళ్లు తక్షణమే చేయించాలన్నారు. ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్న గురుకులాల్లో కనీస అవసరాలను తీర్చే విధంగా భవన యజమాలు మరమ్మతులను చేయించాలని ఆదేశించారు.

చేయని పక్షంలో వారికి ఇచ్చే అద్దెలో మినహాయించి మరమ్మలులు చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కూళ్లను నడిపిస్తుందని, చిన్న చిన్న సమస్యలతో ఆ ప్రతిష్టను తగ్గించకూడదని సూచించారు. అదే విధంగా మొరం పోయడం, కాంపౌండ్ వాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, రూఫ్ లీకేజీ వంటి మేజర్ సమస్యలకు గాను ప్రణాళికలు తయారు చేసి రీజినల్ కో ఆర్డనేటర్ కు పంపాలని, రీజినల్ కో ఆర్డనేటర్ పరిశీలించి నివేదికలు తమకు పంపాలని వివరించారు.

మెస్ కమిటీ తిన్న తర్వాతనే పెట్టాలి....

పిల్లలకు అందించే ఆహారం మెనూ ప్రకారం పరిశుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూడాలని, మెస్ కమిటీ వాళ్లు తిన్న తరువాత పిల్లలకు పెట్టాలని కలెక్టరు తెలిపారు. స్టోర్​ రూములో నాణ్యత గల వంట సామాగ్రిని తీసుకోవాలని, తడి లేకుండా నిలువ చేయాలని సూచించారు. విద్యార్థులకు జ్వరం కానీ ఏదైనా అనారోగ్యం కలిగితే రెండురోజుల వరకు విడిగా ఉంచి వైద్యం చేయించాలని తగ్గని పక్షంలో దగ్గరగా ఉన్న పల్లెదవఖానా, పీహెచ్ సీ సెంటర్లలో చూపించాలని కోరారు.

ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్టాఫ్ నర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, పల్లెదవఖానా, పీహెచ్ సీ సెంటర్లలోని డాక్టర్ల ఫోన్ నెంబర్లు, అంబులెన్సు ఫోన్ నెంబర్లు నర్సు దగ్గర ఉండేలా చూడాలన్నారు. అవసరమైన మందులను డీఎంహెచ్ఓ నుండి తీసుకోవాలని సూచించారు. బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గస్తీ కోసం అదనపు పోలీసులను కావాలని అడిగితే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా రెసిడెన్షియల్ ప్రిన్సిపాళ్లు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ అధికారి కేషురాం, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కె.వీణ, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story