గంజాయి మత్తులో ఆవుల పై దాడి…సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు అరెస్ట్

by Kalyani |
గంజాయి మత్తులో ఆవుల పై దాడి…సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు అరెస్ట్
X

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: గంజాయి మత్తులో ఓ యువకుడు కర్కశత్వం ప్రదర్శించాడు. మూగజీవాలైన ఆవులపై బ్లేడ్ కట్టర్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మూడు ఆవులకు గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కార్ఖానా పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కార్ఖానా పిఎస్ పరిధిలోని కాకాగుడా ప్రాంతానికి చెందిన గుంటి హరీష్(23) స్థానికంగా ఉన్న ఓ టెంట్ హౌస్ లో కూలీగా పనిచేస్తున్నాడు. పనికి సక్రమంగా వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ గంజాయికి అలవాటు పడ్డాడు.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాకాగుడా హనుమాన్ దేవాలయం సమీపంలో నిద్రిస్తున్న మూడు ఆవులపై గంజాయి మత్తులో ఓ బ్లేడ్, కట్టర్ తో దాడి చేశాడు. ఆలయానికి సంబంధించిన ఆవుతో పాటు స్థానికంగా చిన్నా అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులపై బ్లేడ్, కట్టర్ తో దాడి చేశాడు. ఒక ఆవుకు ముక్కువద్ద, మరో ఆవుకు కడుపుపై, మరో ఆవు కుడి కాలు వెనుక భాగంలో దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి ఇంటికి పరారై రక్తపు మరకలు ఉన్న చొక్కాను విప్పి, మరో చొక్కా వేసుకొని ఏం తెలియని వాడిలా నిద్రించాడు.

ఉదయం 6గంటల ప్రాంతంలో ఉదయం వాకింగ్ కు వచ్చిన కాకాగుడా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కె. బిక్షపతి ఆవుల ఆరుపులను చూసి దగ్గరకు వెళ్లి చూడగా వాటి శరీరాలపై చాకుతో దాడి చేసిన ఆనవాళ్లు గమనించాడు. వెంటనే స్థానికుల సహకారంతో కార్ఖానా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి బోయిన్ పల్లి మార్కెట్ సమీపంలోని పశువుల ఆసుపత్రి వైద్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆవులకు ప్రథమ చికిత్స చేశారు. ఆవులకు గాయాలు పెద్దవి కావడంతో మెరుగైన చికిత్స కోసం స్థానికుల సహకారంతో బోయి గూడ లోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చేయించారు.

రాత్రి వరకు స్నేహితులతో గంజాయి సేవించి ఈ ఘాతుకానికి పాల్పడిన గుంటి హరీష్ దాదాపు అర్ధరాత్రి 2 గంటల వరకు ఘటనా స్థలం సమీపంలోనే గంజాయి సేవించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సేవించిన స్నేహితులు వెళ్లిపోగా మత్తులో ఉన్న గుంటి హరీష్ ఆవులపై ఇలా బ్లేడ్ కట్టర్ తో దాడి చేసి కర్కశత్వం చూపించాడు. దాడికి అనంతరం ఇంటికి వెళ్లి పోయాడు.పోలీసులు ఇంటికి వెళ్లి తీసుకు వచ్చి ఉదయం విచారణ చేసిన పోలీసులు, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా గుంటి హరీష్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు అతనితో పాటు పలువురు స్నేహితులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా గుంటి హరీష్ చేసిన ఘనకార్యం బయటపడింది.

ఇంతకు ముందు మారేడుపల్లి, కార్ఖానా, గోపాలపురం తదితర పోలీస్ స్టేషన్ ల పరిధిలో పలు కేసుల్లో జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఆవుల్లో రెండు ఆవులు స్థానికంగా ఉండే చిన్నా అనే వ్యక్తికి సంబందించినవి కావడం, అతను నిందితుడికి బంధువని ఓ సందర్భంలో చిన్నా గుంటి ని మందలించిన సందర్బం ఉందని పోలీసులు తెలిపారు. అది మనసులో పెట్టుకొని ఈ దాడికి పాల్పడి ఉండవచ్చన్న కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుని నిందితున్ని గంట వ్యవధిలో అరెస్ట్ చేసిన ఇన్స్ పెక్టర్ రామకృష్ణ ను ఉన్నతాధికారులు స్థానికులు అభినందించారు.

Next Story