పెరుగనున్న భూముల రిజిస్ర్టేషన్ ల ధరలు...

by Sumithra |
పెరుగనున్న భూముల రిజిస్ర్టేషన్ ల ధరలు...
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రియల్ భూం ఢమాల్ అయిన విషయం తెల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గతంలో కళకళలాడేవి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రంగానే అమలు చేస్తుండడంతో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పై పడింది. దాదాపు 6 నెలలుగా భూముల క్రయవిక్రయాలు నామమాత్రంగానే జరిగాయి. ఉద్యోగులు కాస్తోకూస్తో డబ్బులు కూడబెట్టుకున్న వారు మాత్రమే రిజిస్ట్రేషన్ల వైపు చూడడంతో రిజిస్ట్రేషన్లు సగానికి సగం జరగడం గమనార్హం. గత ప్రభుత్వం 2021-22 సంవత్సరం మార్కెట్ వాల్యును ఆనాడు పెంచారు. దాదాపు 15 నుంచి 20 శాతం ధర పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజనాను పెంచుకునేందుకు మరోసారి 30 శాతం వరకు మార్కెట్ వాల్యును పెంచే పనిలో పడింది. ఈ విషయం ప్రజల్లోకి చేరడంతో రియల్ భూంపై ప్రభావం పడుతుందా అనే చర్చ మొదలయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఒకప్పు డు బీబీపేట్, బిచ్కుంద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే అతి తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడ రోజుకు 60 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి.

ఒక్కోసారి 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగిన రోజులున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 30 నుంచి 40 శాతం రిజిస్ట్రేషన్లు దాటడం లేదు. బీబీపేట్ లో 10, బిచ్కుందలో 5 కు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. నిత్యం జరిగే రిజిస్ట్రేషన్లే రియల్ ప్రభావం ఎలా ఉందని చెప్పకనే చెబుతుంది. గతంలో మాదిరిగా కొత్త ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిక్కచ్చిగా ఉండడంతో పాటు నాలా లేకుండా రిజిస్ట్రేషన్లు జరుకూడదన్న నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండడంతో రియల్ భూం పై ప్రభావం పడుతుంది. అయితే కొత్తగా నిజామాబాద్ నగరంతో పాటు కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ రియల్ భూం అంతంత మాత్రంగానే ఉండటం ఇతర ప్రాంతాలపై దాని ప్రభావం మెండుగా ఉంది. నూడా పరిధిలోనే అక్రమ లేఔట్లు అంటూ రిజిస్ట్రేషన్ల కు కొర్రీలు పెడుతుండగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదే పరిస్థితి నెలకొంది. అర్థికంగా, విస్థరణ పరంగా పెద్ధ మున్సిపాల్టీలు ఐన బోధన్, ఆర్మూర్ లలో నివాస స్థలాలు, ఓపేన్ ప్లాట్లు క్రయ విక్రయాలపై ప్రబావం పడింది. ఈ నేపథ్యంలోను ప్రభుత్వం కొత్తగా మార్కెట్ రేట్ లను పెంచనుండటం అవి అగస్టులో నుంచి అమలు అనే ప్రచారం రియల్ రంగంను షేక్ చేస్తుంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎరియాలలో ఒక రేటు, గ్రామీణ ప్రాంతాల్లో మరో రేటు నిర్ణయించేందుకు సర్వేలను నిర్వహించారు.

మిగిలింది ప్రభుత్వం తిసుకున్న నిర్ణయం మేరకు మార్కెట్ వాల్యూ పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ లు పెరుగుతాయని రియల్ రంగం ఆశగా ఎదురు చూస్తుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ సంస్థలు ఏవి అడుగు పెట్టలేదు. స్థానికంగా ఉండే రియల్ వ్యాపారులే తమ వెంచర్ లను విస్తరిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా కొత్తగా వెంచర్ లు ఏర్పాటు జరుగలేదని, గత ఎడాది వేసిన ప్లాట్లే అమ్ముకుంటున్నామని మరికొంత మంది వ్యాపారులు చెబుతున్నారు. రియల్ రంగంపై ఆధారపడిన ఎజెంట్ల కు ప్రస్తుతం గడ్డు కాలమే అని చెప్పాలి. ఇక దస్తావేజు లేఖరులు సైతం అడఫ దడపా డాక్యుమెంట్లు వస్తున్నాయని గతంలో మాదిరిగా జోష్ పెరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న రైతుబంధు రుణమాఫీ రెండు లక్షలు అమలు నుంచి రియల్ రంగం పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచే శాఖలలో ప్రధానమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ నిర్ణయాలపై అధాయం పెరుగుదల కోసం ఆశగా ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆగస్టు నెలలో ఈ అంకానికి తెరపడుతుందని చెప్పాలి.

Next Story

Most Viewed