‘ఆపరేషన్ స్టార్ట్’.. ఈ నెల 10న తెలంగాణకు AICC నిజనిర్ధారణ కమిటీ

by Satheesh |
‘ఆపరేషన్ స్టార్ట్’.. ఈ నెల 10న తెలంగాణకు AICC నిజనిర్ధారణ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలను విశ్లేషించేందుకు ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల 10న రాష్ట్రానికి వస్తున్నది. సీనియర్ నాయకుడు పీజే కురియన్ నేతృత్వంలో రకీబుల్ హుస్సేన్, పర్గత్‌సింగ్‌ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ పీసీసీ నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి లీడర్లు, కేడర్‌తోనూ సంప్రదింపులు జరపనున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ లక్ష్యంగా పెట్టుకున్న మిషన్-15 ఎందుకు నెరవేరలేదో, ఎనిమిది మంది గెలుపునకు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందో నిజనిర్ధారణ కమిటీ విశ్లేషించనున్నది. కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నది. కేవలం తెలంగాణకే కాక కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలను నియమించింది.

రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నప్పటికీ ఓడిపోయిన పార్లమెంటు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో తిరిగి వివరాలను సేకరించనున్నది. నియోజకవర్గ స్థాయి లీడర్లు, కేడర్‌తో పాటు ఇన్‌చార్జిలుగా ఉన్న నేతలు, బాధ్యులుగా నియమితులైన మంత్రులతోనూ ఈ కమిటీ సమావేశం కానున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందే 37 మందికి నామినేటెడ్ పదవులను ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నాయకత్వం స్పష్టంగా చెప్పినా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ఈ కమిటీ ఆరా తీయనున్నది. మంత్రులు ఎమ్మెల్యేలుగా గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకంటే ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో, అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనవాటికంటే ఎందుకు తగ్గాయో కూడా వివరాలను రాబట్టనున్నది.

పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటించే సందర్భంగా అక్కడి పార్టీ లీడర్లు, కేడర్ నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఈ కమిటీ ఒక స్పష్టతకు రానున్నది. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించినవారెవరు, మొక్కుబడిగా వ్యవహరించిందెవరు, అసెంబ్లీలో గెలిచామన్న అతి విశ్వాసంతో అంటీ ముట్టనట్లుగా పరిమితమైందెవరు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఈ కమిటీ తెలుసుకోనున్నది. నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న లీడర్లు బాధ్యత తీసుకున్నచోట కాంగ్రెస్‌కు పడిన ఓట్లెన్ని, ఎందుకు తగ్గాయో వారితోనే మాట్లాడి ఆ పోస్టుల్ని వారికే ఉంచడమా?.. లేక మార్పులు చేయడమా?.. అనే అంశాలపైనా ఈ కమిటీ తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి ఇచ్చే నివేదికలో పొందుపర్చనున్నది.

Next Story

Most Viewed