- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly locations : మల్కాజ్ గిరిలో పెరుగనున్న అసెంబ్లీ స్థానాలు
దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతి పెద్దదిగా పేరొందింది. ఈ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 35 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. అయితే 2026 తర్వాత జరిగే డిలిమిటేషన్ వల్ల మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలు రెట్టింపయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఎల్.బీ.నగర్ నియోజకవర్గాల నుంచి బాలానగర్, అల్వాల్, నిజాంపేట లేదా బాచుపల్లి, కాప్రా, ఘట్ కేసర్,జవహర్ నగర్, హయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కంటోన్మెంట్ లో మాత్రం స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టనున్నట్లు సమాచారం. ఈ లెక్కన 2025లో జనాభా గణించే ప్రక్రియ మొదలు పెట్టి 2026లో ముగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. చివరిసారి 2011లో నిర్వహించిన ఈ ప్రక్రియను 2021 (ప్రతి పదేళ్లకు ఒకసారి)లో చేపట్టాల్సింది. కానీ కరోనా మహమ్మారితో ఈ ప్రక్రియ వాయిదా పడింది. నాలుగేళ్లు అలస్యంగా 2025లో జనాభాను గణించేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు ఆరాటపడుతున్న కొందరు నేతలు కొత్త నియోజకవర్గాలపై ఆరా తీస్తున్నారు.
కూకట్ పల్లి నుంచి బాలానగర్..
నియోజక వర్గాలు పునర్విభజన జరిగితే కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో మరో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బాలానగర్ ను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ డివిజన్లను కలుపుతూ కూకట్ పల్లి, కేపీహెచ్బీ, బాలాజీనగర్, అల్లాపూర్ డివిజన్లతో కూకట్ పల్లి నియోజక వర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. బాలానగర్ నియోజకవర్గంలో బాలానగర్, ఫతేనగర్, మూసాపేట్, బేగంపేట్ డివిజన్లు వచ్చే అవకాశం ఉందన్నప్రచారం సాగుతోంది.
మేడ్చల్ లో రెండు
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకటి లేదా రెండు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు అన్నట్లు తెలుస్తోంది. ఘట్ కేసర్ ఉమ్మడి మండలంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లతోపాటు ఘట్ కేసర్ మండల పరిధిలోని పోచారం, ఘట్ కేసర్ మున్సిపాలిటీలతో ఘట్ కేసర్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది.
అదే విధంగా జవహర్ నగర్ లేదా కీసర నియోజకవర్గం కేంద్రంగా నాగారాం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలతో పాటు, జవహర్ నగర్ కార్పొరేషన్ ప్రాంతాన్ని కలుపుకుని నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గుండ్ల పోచం పల్లి ,తూంకుంట,మేడ్చల్ మున్సిపాలిటీలతోపాటు మేడ్చల్, శామీర్ పేట, ఎంసీ పల్లి రూరల్ మండలాల పరిధిలోని గ్రామాలతో మేడ్చల్ కేంద్రంగా నియోజకవర్గం కొనసాగే అవకాశాలున్నాయి.
మల్కాజ్ గిరిలో మరో నియోజకవర్గం..
మల్కాజ్ గిరిలో మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అల్వాల్ సర్కిల్ లోని మచ్చబొల్లారం, వెంకటాపూర్, అల్వాల్ మూడు డివిజన్లతోపాటు కంటోన్మెంట్ నియోజవకవర్గంలోని బొల్లారం, కూకట్ పల్లిలోని ఓల్డ్ బోయిన్ పల్లిని కలుపుకొని అల్వాల్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జనాభా తక్కువ ఉంటే సుచిత్ర, పేట్ బషీర్ బాగ్ ప్రాంతాలను సైతం ఇదే నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఈస్ట్ అనందబాగ్, నేరేడ్ మెట్, మల్కాజ్ గిరి, మౌలాలి, గౌతమ్ నగర్ డివిజన్లు ఉండే అవకాశం ఉంది.
ఉప్పల్ లో కొత్తగా కాప్రా..
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాప్రా కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాప్రా నియోజకవర్గంలోకి ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట్ ఎస్ బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, కాప్రా డివిజన్లను చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా డివిజన్లలో నియోజకవర్గానికి సరిపడే జనాభా లేనట్లయితే నాగారం మున్సిపాలిటీని ఇందులో కలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయతే ఉప్పల్ నియోజకవర్గంలో హబ్సిగూడ, చిలుకానగర్, రామాంతాపూర్, ఉప్పల్, నాగోల్ డివిజన్లు ఉండే అవకాశాలున్నాయి.
ఎల్బీనగర్ లో హయత్ నగర్...
లాల్ బహదూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సాధారణంగా ఎల్బీనగర్ అని పిలుస్తారు. వనస్థలీపురం, హయత్ నగర్, సరూర్నగర్ లో కొంత భాగం, దిల్ సుఖ్ నగర్, కొత్తపేటలో కొంత భాగం, హస్తినాపురం ప్రాంతాలలో ఏర్పాటైన నియోజకవర్గంలో ప్రస్తుతం 5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే కొత్తగా హయత్ నగర్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హయత్ నగర్ మండలంలోని పెద్ద అంబర్ పేట, తుర్కంజాయల్, అబ్దుల్లాపూర్ పేట ప్రాంతాలతో పాటు ఇబ్రహింపట్నం, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొన్ని ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మిగితా ప్రాంతాలతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.
కుత్బుల్లాపూర్ లో నిజాంపేట...
కుత్బుల్లాపూర్ లో నిజాంపేటను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో లక్షన్నర ఓటర్లు ఉండగా, బాచుపల్లి, గాజుల రామారం (సర్కిల్ )ను కలుపుకొని నిజాంపేట కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. మిగితా ప్రాంతాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండనున్నట్లు తెలిసింది.