చేపలు చెరువుకు చేరేదెప్పుడో..?

by Sridhar Babu |
చేపలు చెరువుకు చేరేదెప్పుడో..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మత్స్య కారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొంది. జూలై మూడో వారంలోనే చేప పిల్లలు పంపిణీ జరగాల్సి ఉన్నప్పటికీ ఆగస్టు నెల పూర్తి అవుతున్నా ఇంకా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ టెండర్ల దశలో ఉండటంతో మత్స్య కారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పెండింగ్ బిల్లుల కారణంగా రెండు పర్యాయాలు బిడ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

సిద్దిపేట జిల్లా పరిధిలో వంద ఎకరాల విస్తీర్ణం పైన ఉన్న చెరువులు 247, వంద ఎకరాల విస్తీర్ణం కంటే తక్కువ ఉన్న చెరువులు 1468 ఉండగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1715 చెరువులు ఉన్నాయి. మేజర్ చెరువుల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల చేప పిల్లలు, మైనర్ చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీ మీటర్ల పొడవు గల చేప పిల్లను వదిలేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో 4 కోట్ల 42 లక్షల 55 వేల చేప పిల్లలు ( 80-100 మిల్లీమీటర్ల పొడవు గలవి 2 కోట్ల 63 లక్షల 84 వేల చేప పిల్లలు, 35 -40 మిల్లీ మీటర్ల పొడవు గలవి కోఠి 78 లక్షల 70 వేలు చేప పిల్లలు ) వదిలేందుకు కాంట్రాక్టర్ల నుంచి మత్స్య శాఖ అధికారులు టెండర్లు పిలిచారు.

బిడ్లు దాఖలుకు ముందుకు రానీ కాంట్రాక్టర్లు

గత ఏడాది చెరువుల్లో చేప పిల్లలు వదిలిన కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదన్న కారణంతో ఈ ఏడు బిడ్లు దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందు రాలేదు. జూలై 15 నుంచి ఆగస్టు 2 వ తేదీ వరకు రెండు పర్యాయాలు ఒక్కరు కూడా బిడ్లు దాఖలు చేయలేదు. తదుపరి ఆగస్టు 13వరకు గడువు పొడిగించడంతో ఇద్దరు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు.

ఎదుగుదలపై ప్రభావం

టెండర్ల ప్రక్రియలో ఆలస్యం కారణంగా చేప పిల్లల పంపిణీ జాప్యం నెలకున్న నేపథ్యంలో చెరువుల్లో చేప పిల్లలు వదిలినా ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటుందని మత్స్య కారులు వాపోతున్నారు. దీనికి తోడు వర్షాలు ఆలస్యంగా కురవటం.. చెరువులు పూర్తి స్థాయిలో నీరు చేరని కారణంగా చేప పిల్లలు వదిలేందుకు సమస్యగా మారింది.

సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తాం: జిల్లా మత్స్యశాఖ అధికారి వరదా రెడ్డి

చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. మత్స్య కారులు ఆందోళన చెందవద్దు. నాణ్యమైన చేప పిల్లలు చెరువుల్లో వదులుతాం.

Advertisement

Next Story

Most Viewed