వనదుర్గమ్మ చెంత హోరెత్తిన బోనాల జోరు

by Naresh |   ( Updated:2023-10-20 13:55:40.0  )
వనదుర్గమ్మ చెంత హోరెత్తిన బోనాల జోరు
X

దిశ, పాపన్నపేట: పాపన్నపేట మండలం ఏడుపాయల్లో కొలువుదీరిన వనదుర్గమ్మ దగ్గర శుక్రవారం బోనాల జోరు హోరెత్తింది. అంగరంగ వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం షష్టి పురస్కరించుకొని వనదుర్గామాత చదువుల వరదాయినిగా(సరస్వతీ మాత)తెలుపు రంగు చీరలో భక్తులకు దర్శనమిచ్చింది. గోకుల్ షెడ్‌లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 బోనాలను డప్పు చప్పుళ్ళు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వన దుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వన దుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా.. అంటూ వేడుకున్నారు. వనదుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆలయ పాలకమండలి చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. జోగిని పావని బోనంతో పలు ప్రదర్శనలు నిర్వహించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆమె ప్రదర్శనలతో ఏడుపాయల సన్నిధి సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి పి. మోహన్ రెడ్డి, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story